తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతలుగా చెప్పాల్సి వచ్చినప్పుడు.. అందునా టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్.. హరీశ్ ఇద్దరు పోటాపోటీగా నిలుస్తారు. వీరిద్దరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాలే కానీ.. వారి మాటల్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయటానికి మీడియా సంస్థలు ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ.. మీడియా సంస్థల్ని మంత్రి హరీశ్ ప్రత్యేకంగా రిక్వెస్టు చేస్తున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
అనుకున్నంత ఈజీగా లేదు
దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్‌కు అప్పజెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. అభ్యర్థిని గెలిపించుకురావాలన్న ఆదేశాన్ని పక్కాగా అమలు చేయటమే కాదు.. తన మార్కు ఏమిటో చూపించాలన్న ఉత్సాహంతో ఉన్నారు హరీశ్ రావు. అయితే, విషయం ఆయన అనుకున్నంత ఈజీగా లేదన్నది చాలా త్వరగానే గ్రహించారు. ఆయన అంచనాల్ని వమ్ము చేస్తూ.. పక్కా వ్యూహంతో.. కమలనాథులు ఉప ఎన్నికలో దూసుకొచ్చిన వైనంతో గులాబీ దళం తత్తరపాటుకు గురైనట్లుగా చెప్పక తప్పదు. హరీశ్ నోటి నుంచి వచ్చిన ‘దుబ్బాక పాత బస్టాండ్ కు రా’ అన్న సవాలును తమకు అనుకూలంగా మార్చుకొని వైరల్ చేసిన వైనం హరీశ్ వర్గానికి భారీ షాక్‌ను ఇచ్చిందని చెబుతారు.
ప్లానింగ్‌లో మార్పులు
కమలనాథుల ప్లానింగ్‌ను అర్థం చేసుకోవటానికి కాస్త టైం తీసుకున్న హరీశ్ రావు.. ప్లాన్ బీ లోకి వెళ్లినట్లు చెబుతారు. సహజంగా ఉండే దూకుడుకు.. అధికారాన్ని చేర్చటంతో పాటు.. ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే రీతిలో నోటికి పని చెప్పటం షురూ చేశారు. అయినప్పటికీ కమలనాథుల నుంచి వస్తున్న ప్రతిస్పందనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన విషయాన్ని గుర్తించిన హరీశ్, తన ప్లానింగ్‌లో కొత్త మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన, గతానికి భిన్నంగా కాస్త ప్రయారిటీ ఇవ్వాలని ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు చెప్పటం కనిపించింది. అనంతరం మీడియా సంస్థలకు చెందిన ముఖ్యులకు ఫోన్లు చేసి, ప్రెస్ మీట్‌కు ప్రయారిటీ ఇవ్వాలని కోరటం గమనార్హం.
తనను తాను ఫోకస్ చేసుకోవాలని..
అంతేకాదు, రానున్న ఒకట్రెండు రోజుల్లో తన ప్రత్యేక ఇంటర్వ్యూల్ని ప్రధాన పత్రికల్లో వచ్చేలా ప్లాన్ చేస్తుకున్నట్లుగా సమాచారం. ఎందుకిదంతా చేస్తున్నట్లు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక వేళ.. తాను చేస్తున్న కష్టం తెలిసేలా చేయాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు. అన్నింటికి మించి ఇటీవల ప్రచారం విషయంలో తాను వెనుకబడినట్లుగా హరీశ్ భావిస్తున్నారు. అందుకే దుబ్బాక అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవటానికి వీలుగా, ప్రత్యేక ఇంటర్వ్యూలతో తనను తాను ఫోకస్ చేసుకోవాలన్నది హరీశ్ ఆలోచనగా చెబుతున్నారు.