తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకటి దుబ్బాక. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడీ నియోజకవర్గం పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోవటమే కాదు.. ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. దుబ్బాకలో గెలుపు ఎవరిది? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మీడియా ప్రతినిధి ఒకరు అడిగితే, అదెప్పుడో డిసైడ్ అయ్యింది, ఎప్పుడో మా పేరు మీద రాసి పెట్టుకున్నామంటూ సీఎం కేసీఆర్ ధీమాగా చెప్పేశారు. ఆయన మాటల్లో వినిపించినంత ధీమా.. నిజంగానే ఉందా? అలాంటి పరిస్థితే ఉంటే సీఎం మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్‌రావు అంతలా చెమటలు చిందించాల్సిన అవసరం ఏముంది? అంత ఆవేశపడరు కదా? సీఎం అన్న మాట నిజమవుతుందా అనే భావన చాలామందిలో కలిగిస్తోంది.
పొలిటికల్ డ్రామా
ఇటీవల కాలంలో మరే ఉప ఎన్నికలో చోటు చేసుకోని పొలిటికల్ డ్రామా దుబ్బాకలో చోటుచేసుకుంటోంది. మొదట్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పోటీ ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మార్చటంలో కమలనాథులు సక్సెస్ అయ్యారు. దీంతో తెలంగాణ అధికార పక్షానికి అసలుసిసలు ప్రత్యామ్నాయం తామే అన్న సందేశాన్ని తెలంగాణ ప్రజలకు వారు ఇచ్చినట్లైంది. ఈ తీరు కాంగ్రెస్ నేతల్ని కలిచివేస్తోంది.
ఎన్నికల ప్రచారంలో కమలనాథులు వ్యవహరించినంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లేదన్న మాటను టీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మరోమూడు రోజుల్లో జరగనున్న దుబ్బాక ఎన్నికల పోలింగ్ లో అక్కడి ప్రజల తీర్పు ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బరిలో ఉన్న అభ్యర్థులంతా సానుభూతి అస్త్రాన్ని సంధించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
సానుభూతి అస్త్రాలు
భర్త మరణంతో పుట్టెడు శోకంతో ఉన్న తనను గెలిపించాలని సోలిపేట రామలింగారెడ్డి సతీమణి ప్రచారం చేస్తున్నారు. తానెంత ప్రయత్నించినా, ప్రతిసారి రిజెక్టు చేసిన దుబ్బాక ఓటర్లు, ఈసారైనా తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు కన్నీరు పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సైతం తన తండ్రి మరణాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు సేవ చేసినా, పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఈసారైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.
డిసైడ్ చేసేది బీసీలే
1.98లక్షల మంది ఓటర్లు ఉన్న దుబ్బాకలో విజయాన్ని డిసైడ్ చేసేది బీసీలేనని చెప్పాలి. మొత్తం ఓటర్లలో లక్ష ఓటర్లు మహిళలు అయితే.. పైన ఉన్న 98 వేలు పురుషలవి. నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులు 41వేల మంది ఉండగా ఇతర బీసీ కులాలు దగ్గర దగ్గర 48 వేల వరకు ఉంటారు. మాదిగలు23వేల మంది మాలలు 11వేల మంది ఉన్నారు. వీరు కాక రెడ్లు 9 వేల వరకు ఉండగా, మైనార్టీల్లోని రెండు వర్గాల వారు కలిపి ఆరు వేల మంది ఉన్నారు. మిగిలిన వారితో పోలిస్తే అగ్రవర్ణాలు తక్కువనే చెప్పాలి. దుబ్బాకలో విజయం సాధించాలంటే బీసీలతో పాటు బడుగు, బలహీన వర్గాల మనసుల్ని దోచుకోక తప్పదు. మరి.. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు వీరి మనసుల్ని గెలుస్తారో చూడాలి.