ఎక్కడ అంధ్రా? ఎక్కడ తెలంగాణ? జగన్ అభిమానులకు.. దుబ్బాకకు సంబంధం ఏమిటి? మోకాలికి బోడిగుండుకు భలేగా లింకు పెడతారే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అలాంటిది మరి. ప్రపంచంలో ఏం జరిగినా సరే.. దాన్ని తమకు రిలేట్ చేసుకొని బెట్టింగ్‌లు ఆడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆంధ్రాలో ఇలాంటి వారు కాస్త ఎక్కువే. అలాంటి వారికి దుబ్బాక ఉప ఎన్నికకు మించిన అంశం ఇంకేం ఉంటుంది? అందులో, అందరూ మన చుట్టాలే అనుకున్న వేళ హైదరాబాద్‌లో ఉన్న మనోడికి ఫోన్ కొట్టేసి.. ఏంట్రా.. దుబ్బాకలో సీనేంటి? అన్నంతనే.. తనకున్న అవగాహనతో సమాధానం చెప్పేటోళ్లు, వారిచ్చే ఇన్‌పుట్స్‌ను తమ తెలివిని.. న్యూస్ ఛానళ్లు.. పేపర్లలో వచ్చే వార్తల్ని తూకం కట్టేసి బెట్టింగ్‌లకు దిగే వాళ్ల సంఖ్య ఎక్కువే.
ఇలాంటోళ్లందరికి దుబ్బాక ఉప ఎన్నిక కొత్త ఆశల్ని రేపింది. తమకు తెలిసిన అంశమే కదా? అన్న ఓవర్ కాన్ఫిడెన్సులో గ్రౌండ్ రియాల్టీ గురించి సరిగ్గా ఆలోచించకుండా కేసీఆర్ మీద నమ్మకంతో లక్షలాది రూపాయిల్ని బెట్టింగ్ పెట్టేశారట. ఇలా పెట్టిన వారిలో అత్యధికులు టీఆర్ఎస్ గెలుపు మీద కాస్తే మరికొందరు టీఆర్ఎస్‌కు వచ్చే మెజార్టీ మీద కాచారట. అలా కాచినోళ్లు అయినా కాస్త తెలివిగా బెట్టింగ్ పెడితే బాగుండేది. అదేమీ లేకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 50వేల పైచిలుకు మెజార్టీ తథ్యం అన్న దాని మీద భారీగా బెట్టింగ్ కాసేశారట.
మితిమీరిన ఆత్మవిశ్వాసం
ఏపీ అధికార పక్షానికి చెందిన వారంతా ఈ తరహా బెట్టింగులు పెడితే, అందుకు భిన్నంగా విపక్ష పార్టీకి చెందిన నేతలు, అభిమానులు మాత్రం ఆచి తూచి అన్నట్లుగా బెట్టింగ్‌ల్లోకి దిగారని చెబుతున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో యాబై వేలు.. నలభై వేలు మెజార్టీ అన్న అంశం మీద ఎక్కువగా బెట్టింగ్ కాశారట. తాజా ఫలితం దెబ్బ వారికి దిమ్మ తిరిగిపోయేలా చేయటమే కాదు.. భారీగా చేతి చమురు వదిలినట్లు చెబుతున్నారు. దుబ్బాక లితం జగన్ అభిమానులకు కోలుకోలేనంత భారీగా దెబ్బేసినట్లుగా చర్చ సాగుతోంది.











