తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. తెరపై తెల్ల మందారంలా మెరిసిన ఈ నాయికను చూడగానే, కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. ఆరంభంలో తన క్రేజ్ కి తగిన విధంగా ఎడాపెడా సినిమాలు చేసేయాలనే ఆరాటాన్ని రాశి ఖన్నా కనబరచలేదు. ‘నిదానమే ప్రధానం’ అన్నట్టుగా ఆమె తన కెరియర్ గ్రాఫ్ ను కొనసాగిస్తూ వచ్చింది. అలా ‘జిల్’ .. ‘బెంగాల్ టైగర్’ .. ‘తొలిప్రేమ’ వంటి కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోగలిగింది.
ఆ మధ్య రాశి ఖన్నా చేసిన ‘వెంకీమామ’ చిత్రంలోని ‘హారిక’ పాత్ర, ‘ ప్రతిరోజూ పండగే’లోని ‘ఏంజిల్ ఆర్న’ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కామెడీ టచ్ తో కూడిన ‘ఏంజిల్ ఆర్న’ పాత్రలో ఆమె చేసిన సందడికి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత కొత్తగా వుంటుందనే ఉద్దేశంతో ఆమె ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ‘యామిని’ పాత్రను పోషించింది. ఈ పాత్రను అంగీకరించి ఆమె పొరపాటు చేసిందనే టాక్ అప్పట్లో వినిపించింది. అమాయకత్వంతో కూడిన అందంతో, అప్పటివరకూ సున్నితమైన సరదా పాత్రలు చేస్తూ వచ్చిన రాశి ఖన్నాను ‘యామిని’ పాత్రలో ప్రేక్షకులు చూడలేకపోయారు.
కారణమేదైనా ఆ తరువాత రాశి ఖన్నా తమిళ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అదృష్టం కొద్దీ అక్కడ ఆమెను విభిన్నమైన పాత్రలే పలకరిస్తున్నాయి. సుందర్ సి. దర్శకత్వం వహిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘అరణ్మణై 3’లో ఆర్య జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇక ‘మేథావి’ సినిమాలోను హీరో జీవా సరసన ఆమెకి విలక్షణమైన పాత్ర దక్కింది. పా విజయ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో ఆమె వుంది.
ఇక ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలోను రాశి ఖన్నా మంచి ఛాన్స్ కొట్టేసింది. కథానాయకుడిగా సిద్ధార్థ్ నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ఆమె కొత్తగా కనిపించనుంది. కామెడీతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ కథ నడుస్తుంది. కార్తిక్ జి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా తమిళంలో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు లభిస్తుండటంతో, అక్కడి అవకాశాల పైనే ఆమె మరింత ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు తెలుగు దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.