దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పై వచ్చిన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవలే ప్రభుత్వం అనుమతితో తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
అయితే టీజర్ చివర్లో కొమరం భీమ్‌ను ముస్లిం గెటప్‌లో చూపించడంతో వివాదం చెలరేగింది. రాజమౌళి మాత్రం ఈ వివాదాలను పట్టించుకోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నాడు. ఈ సినిమాలో అలియా భట్, సీత పాత్రలో నటిస్తోంది. ఈ అమ్మడు త్వరలోనే చిత్ర యూనిట్‌తో జత కలవనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆమె నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోందట. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో సీత పాత్ర తక్కువ సమయం ఉన్నా పాన్ ఇండియా సినిమా కావడంతో దర్శకుడు రాజమౌళి అలియా భట్ ను తీసుకున్నాడు. రామరాజు, సీతపై వచ్చే సన్నివేశాలు చాలా సున్నితంగా, ప్రేక్షకులకు కనువిందుగా ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో పాటు హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను 450కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు చరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.











