టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో నుంచి దిగిపోయిన నేత. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రమే ఉన్నారు. టీడీపీ తరఫున విజయం సాధించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురిని వైసీపీ లాగేసింది. వెరసి అసెంబ్లీలోనూ పెద్దగా బలం లేని నేతగానే చంద్రబాబును చెప్పుకోవాలి. ఏ లెక్కన చూసినా.. చంద్రబాబుతో జగన్‌కు ఇప్పుడప్పుడే పెద్దగా ముప్పేమీ కూడా లేదు. మరి ఎందుకు చంద్రబాబును చూసినా.. ఆయన కదలికలను చూసినా వైసీపీ జడుసుకుంటోంది? చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతున్నారంటే.. ఎందుకు వణికిపోతోంది? తన పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళతానని చంద్రబాబు ప్రకటించినంతనే వైసీపీ ఎందుకు భయపడుతోంది? చంద్రబాబు ఎలా ఢిల్లీ వెళతారు? అంటూ ఆ పార్టీకి చెందిన దాదాపుగా అందరు నేతలూ ఎందుకు వాదిస్తున్నారు? అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లేందుకే వీల్లేదన్న రీతిలో ఎందుకు కామెంట్లు చేస్తున్నారు?.. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన వైసీపీలో ఓ అలజడిని అయితే రేపిందనే చెప్పాలి.
వైసీపీ భయానికి రీజనిదేనా?
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే అక్రమాదాయానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు కూడా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేశాయి. ఇక కేసుల తుది విచారణే తరువాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సీబీఐతో కేసుల విచారణ వాయిదా పడేలా చేస్తున్న జగన్.. ఈడీ చేత కూడా అదే మంత్రాన్ని పఠించేలా వ్యూహం రచిస్తున్నారు. ఇందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మద్దతు పలుకుతూ సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అటు ప్రధాని నరేంద్ర మోదీతో, ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయితే.. అనుకోని పరిస్థితుల్లో బీజేపీతో టీడీపీకి మైత్రి కుదిరితే.. జగన్ కేసుల విచారణలు మొదలుకావడం, ఆయా కేసుల్లో దోషిగా తేలితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమే. ఈ పరిస్థితిని ఊహించిన నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటేనే వైసీపీలో వణుకు మొదలైపోతోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తెల్లారితే ఢిల్లీకి బాబు
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తన 36 గంటల దీక్షను విరమించనున్న చంద్రబాబు.. శనివారం ఉదయమే ఢిల్లీ ఫ్లైటెక్కనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసే దిశగా ఇప్పటికే షా అపాయింట్‌మెంట్‌ను కోరారు. దేశంలోని సీనియర్ మోస్ట్ రాజకీయ నేతల్లో ఒకరిగా, బీజేపీకి మిత్రుడిగా చాలా కాలం పాటు కొనసాగిన నేతగా చంద్రబాబు అడిగితే.. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదన్న వాదన వినిపిస్తోంది. అమిత్ షాతో భేటీ సందర్భంగా టీడీపీ కార్యాయాలు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిపై పిర్యాదు చేయడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా అమిత్ షాతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ కొంప కొల్లేరైనట్టేనన్న వాదనలూ లేకపోలేదు. వెరసి చంద్రబాబు ఢిల్లీ టూర్ వైసీపీలో వణుకు పుట్టిస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.