తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవుతారనుకునే రాష్ట్ర మాజీమంత్రి , శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మిడిల్ డ్రాపై , అదే కుటుంబానికి చెందిన యువకుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం అధికంగా కనిపిస్తోంది.
రామ్మోహన్ పేరును సూచించిన చినబాబు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియామకానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు నిర్ణయించినప్పటికీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బాబు తనయుడు, రాష్ట్ర మాజీమంత్రి నారా లోకేష్ కింజరాపు కుటుంబానికే చెందిన యువకుడు , తనకి మంచి మిత్రుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ పేరును సూచించినట్లు తెలుస్తోంది.
బాబాయి స్థానంలో అబ్బాయి
టీడీపీ సీనియర్ నాయకుడు , రాజకీయ ఆరంగేట్రం నుండి ఒకే పార్టీలో కొనసాగుతూ మంచి వాక్పటిమ, చట్టాలు, అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన కలిగివుండటంతో పాటు, పార్టీలోని దిగువస్థాయి కార్యకర్త నుండి ఉన్నతస్థాయి నాయకుల వరకు సత్ససంబంధాలు కలిగివుండటం వల్ల మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని చంద్రబాబు యోచించారు.
ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లా బిసి సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళావెంకటరావు వ్యవహరిస్తున్నందున, అదే జిల్లాకు చెందిన బిసి వర్గనాయకుడైన అచ్చెన్నను నియమించడం వల్ల పార్టీలోని ఇతర సీనియర్ల నుండి అభిప్రాయభేదాలు రావని భావించారు. ఒకనాడు ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న టీడీపీ ఇటీవల కునారిల్లడంతో అచ్చెన్న ద్వారా పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని ఆశించారు.
అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు , అందుకు ముహూర్తం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా లీకులు కూడా ఇచ్చారు. ముహూర్తానికి ఒకటిరెండు రోజుల ముందు అచ్చెన్న ప్రతిపాదనకు లోకేష్ ప్రత్యామ్నాయంగా రామ్మోహన్‌ను సూచించడం, ఆయనకు కూడా బాబాయికి మించిన ప్లస్ పాయింట్లు ఉండటం వల్ల చంద్రబాబు కూడా ఆలోచనలో పడినట్లు తెలిసింది. అందువల్ల లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షులను, కో ఆర్డినేటర్లను మాత్రమే ప్రకటించి, రాష్ట్ర, జాతీయ కార్యవర్గాల ప్రకటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
రామ్మోహన్ పై చినబాబు ఆసక్తి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న కుటుంబానికే చెందిన మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ ఎర్రంనాయుడు తనయుడు ప్రస్తుత శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై చినబాబు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. యువకుడు, మంచి వాక్పటిమ, సమయస్ఫూర్తి, రాజకీయ చతురత కలిగిన నాయకుడు, ముఖ్యంగా చినబాబుకు మంచి స్నేహితుడైన రామ్మోహన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం వల్ల పార్టీ కి పూర్వవైభవం వస్తుందని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో యువరక్తం నింపాలని , కొత్త జవసత్వాలు కల్పించాలని యోచిస్తున్న చంద్రబాబు చినబాబు మాటను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా యోచిస్తునే చంద్రబాబు రాష్ట్ర కమిటీ ప్రకటనకు కొంత సమయం తీసుకున్నట్లు, విజయదశమి సందర్భంగా కొత్త కమిటీ ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబాయ్ అవుతారా , అబ్బాయ్ అవుతారా అనేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో , ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. అందుకోసం వేచిచూడాలి మరి.