వరాహ రూపం పాట మొన్న వివాదంలో చిక్కుకుంది.. ఇప్పుడు వారాహి వాహనమే వివాదాలతో వార్తల్లోకి ఎక్కింది. దీని భావమేమిటో ఆ తిరుమలేశుడికే తెలియాలి. ఈ మధ్య కాలంలో వరాహం అనే పదం చాలా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా కాంతారా సినిమాలోని ఆ పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్టే. ఇప్పుడు ఈ పదమే జనసేన పార్టీకి ఓ మిషన్ గన్ అనుకుంటే.. ఆ మిషను ఇంపాజిబుల్ చేయాలన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఈ వాహనాన్ని సిద్ధం చేసి దీనికి వారాహి అనే పేరు పెట్టారు. ఏది చేసినా వివాదం మన జన్మ హక్కు అనేలా వైసీపీ నేతలు రంగంలోకి దిగి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆలివ్ గ్రీన్ మిలటరీ వాహనాలకేనా? చట్టం ఏంచెబుతోంది? మరి ఎన్టీఆర్ ఎందుకు వేయించారు? లాంటి ప్రశ్నలు ఎన్నో ఈ సందర్భంగా వస్తున్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిజానికి ఈ రంగు మిలటరీ వారికే పరిమితం. దీన్నే ఆలివ్ గ్రీన్ అని, జావా గ్రీన్ అని వ్యవహరిస్తున్నారు. అంతెందుకు ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్ లో ఈ రంగులో ఉన్న 15 వేల వాహనదారులకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ ప్రకారం ఆ వాహనాల యజమానులు రంగులు మార్చి వేశారు కూడా.
ఒకసారి ఈ ప్రచార వాహనాల చరిత్రలోకి వెళదాం. చైతన్య రథం ఆలోచన మాత్రం మహానటుడు నందమూరి తారక రామారావుదేనని అనాలి. 1982లో ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి ఇలాంటి రథం అవసరమైంది. అంతకుముందు ఎంజీఆర్ కు కూడా ఇలాంటి ప్రచార రథం అవసరమైంది. 1972 లో ఎంజీఆర్ పార్టీ పెట్టారు. ఆ స్ఫూర్తితోనే ఎన్టీఆర్, ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రత్యేకమైన వాహనాలను తయారు చేయించుకున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథం కూడా ఇంచుమించు ఇలాంటి ఆలివ్ గ్రీన్ రంగులోనే ఉండేది. కానీ విమర్శించడానికి అప్పట్లో అంత చైతన్యం కూడా లేదు. ఒకవేళ ఆ తర్వాత మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ఉండవచ్చు కూడా. ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథిగా ఆయన కుమారుడు హరికృష్ణే ఉండేవారు. నాడు తెలుగు రాజకీయాల్లో మలుపు తిప్పిన తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీఆర్ చైతన్య రథం తరహాలోనే జనసేన వాహనం కూడా తయారైంది. కాలం మారింది కాబట్టి ఆధునిక హంగులతో ఈ వాహనాన్ని రూపొందించారు. ఇది హైదరాబాద్ లోనే తయారైంది.
బహుశా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఆలివ్ గ్రీన్ వేయించారా అన్న అనుమానం కలగక మానదు. ఇది రెడీ కాగానే వారాహి.. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఈ వారాహి వాహనాన్ని అన్ని హంగులతో తయారు చేయించారు. 360 డిగ్రీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనం కదిలినప్పటి నుంచి సీసీ కెమెరాల ద్వారా రికార్డయ్యే వీడియోలు నేరుగా సర్వర్ కు వెళతాయి. ఇక లైటింగ్, సౌండ్ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా తయారు చేయించారట. పవన్ మీటింగ్ ప్రారంభించగానే కరెంటు పోయే అవకాశాలు ఉన్నాయనే అనుమానంతో వాహనం నుంచి భారీ లైటింగ్ ఇచ్చే ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే వాహనం రంగు మారిస్తే మాత్రం ఇబ్బంది తొలగిపోవచ్చు. వాహనం రంగు మార్చాల్సి వస్తే జనసేన పార్టీ కలర్ వేసే అవకాశం కూడా ఉంది. ఇక విమర్శల విషయానికి వస్తే ఇది గురువింద గింజ మాదరిగానే. వైసీపీ వారు ఇలాంటి విమర్శ చేయడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. తమ బొక్కలు తమకు తెలియక పోయినా ప్రత్యర్థుల విషయంలో బొక్కలు వెతికే పనిని ప్రారంభించారు.
పవన్ ప్రచార రథాన్ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. అదేంటోగాని పేర్నికే పవన్ టార్గెట్ అయ్యాడు. వేరెవరి నోట నుంచైనా ఆ మాట వస్తే సామాజిక కోణం లెక్కలోకి వస్తుంది కాబట్టి బరిలోకి పేర్ని నానినే వదిలినట్టు కనిపిస్తోంది. ఏ రంగు వేశారో చూడకుండా రవాణాశాఖ ఎందుకు అనుమతించిందన్నది అసలు ప్రశ్న. ఇదే విషయానని నాదెండ్ల మనోహర్ కూడా లేవనెత్తారు. హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమీ తగ్గలేదు. విమర్శించేవారికి ధీటైన సమాధానం చెప్పారు. ‘ముందు ఏపీలో నా సినిమాలను ఆపేశారు.
విశాఖలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు. నన్ను హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు. విశాఖ వదిలి వెళ్లపోమని పోలీసులతో బలవంత పెట్టించారు. మంగళగిరిలో నా కారు బయటకు రానివ్వలేదు. ఇప్పుడు నా వాహనం ‘వారాహి’రంగు సమస్య అంటున్నారు. అంటే నేను ఊపిరి పీల్చుకోవటం కూడా ఆపేయాలా? మరి ఇంక ఆ తరువాత ఏంటి..వాట్ నెక్ట్స్?’ అంటూ ప్రశ్నించారు జనసేనాని. ఎన్ని విమర్శలున్నా జనసేనాని వాహనం ముందుకు కదలక తప్పదు. ఈ రంగు బదులు ఇంకో రంగు పడుద్ది. అంజనీ పుత్రుడి ఈ వాహనంపై కురుక్షేత్రం యుద్ధంలో మాదిరిగానే జెండాపై కపిరాజు ఉంటే మంచిదేమో. హనుమంతుడు పవనుడి కులదైవం కదా. చూద్దాం పవన్ సాగించబోయే యుద్ధం ఎలా ఉంటుందో.