తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీలో అంతర్గత విభేదాలు రానున్న కాలంలో పార్టీపై ప్రభావం చూపనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. రెండు రోజుల క్రితం లింగోజీగూడ డివిజన్ ఎన్నికకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలియకుండా ఏకగ్రీవాన్ని ప్రతిపాదిస్తూ కొందరు బీజేపీ నాయకులు కేటీఆర్‌ని కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇక తాజాగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక విషయంలో జనసేన పొత్తుపై నాయకులు ప్రకటించే వరకు బండి సంజయ్‌కి సమాచారం లేదనే చర్చ వస్తోంది. మొత్తం మీద బండి సంజయ్ వ్యతిరేక వర్గం ఇటీవల చురుగ్గా పావులు కదుపుతోందని, ఆ క్రమంలో కొందరు నాయకులను తమవైపు తిప్పుకుందన్న చర్చ కూడా నడుస్తోంది.
లింగోజిగూడ ములాఖత్‌పై కమిటీ..
లింగోజిగూడ (జీహెచ్ఎంసీ) డివిజన్‌లో బీజేపీ నుంచి గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకరానికి ముందే అనారోగ్యంతో చనిపోయారు. అక్కడ మళ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు సామా రాంగారెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌తో కూడా మాట్లాడారు. ఏకగ్రీవానికి టీఆర్ఎస్ అంగీకరించింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌కి సమాచారం లేకుండానే ఈ భేటీలు జరగడంతో పార్టీ విచారణకు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, ఎస్.మల్లారెడ్డి, ఎస్.కుమార్‌లతో కమిటీ వేశారు. టీఆర్ఎస్ నేతలతో ఎందుకు భేటీ అయ్యారు? ఆ భేటీకి కారణాలేంటి? ఆ భేటీలో ఏం చర్చ జరిగింది? అనే అంశాలను కూడా ఆరా తీయనున్నారు. రెండు రోజుల పాటు విచారణ జరగనుంది.
సంజయ్‌పైనే బీజేపీ కామెంట్లు..
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్‌తో బీజేపీ నేతలు జరిపిన సమావేశంలోని కొన్ని అంశాలు బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్‌పైనే బీజేపీ నేతలు సెటైర్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము చెబుతున్నా వినడం లేదని, దూకుడు తగ్గించడం లేదని, కేసీఆర్‌ను విమర్శించడం ఆపడం లేదని కొందరు నాయకులు మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారని, ఇప్పటికే తాము ఆర్ఎస్ఎస్‌కి ఫిర్యాదు చేశామని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇష్టానికి మాట్లాడుతున్నారని, అది సరికాదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేటీఆర్‌తో భేటీ అయిన బీజేపీ నాయకుల్లో ఒకరిద్దరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విచారణ కమిటీ ఏం నివేదిక ఇస్తుందనే చర్చ నడుస్తోంది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల అంశంలోనూ..
ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఖమ్మం కార్పొరేషన్‌లో ఉన్న 60 డివిజన్లలో జనసేనతో ప్రాథమికంగా పొత్తు కుదిరినట్లు బీజేపీ నాయకులు ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్, తెలంగాణ ఇన్‌ఛార్జ్ వివి రామారావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ చర్చల్లో ఒప్పదం కుదిరిందనే ప్రకటన వెలువడింది. అయితే ఈ పొత్తుపై బండి సంజయ్‌కి సమాచారం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పార్టీలో కీలకంగా ఉన్న ఒక మాజీ సారథి, అదే పార్టీకి చెందిన మరో కీలక నేత ఇందుకు కారణంగా తెలుస్తోంది. బండి సంజయ్‌కి బ్రేకులు వేయడంతోపాటు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు బండి సంజయ్‌ని ఏకాకిగా చేసే వ్యూహం అమలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.
టీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ కల్యాణ్ మద్దతు
దుబ్బాక, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలసి పనిచేశాయి. అయితే ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవికి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. జనసేన తెలంగాణలో బీజేపీతో దూరమయ్యేందుకు బండి సంజయ్ కారణమనే రీతిలో ఫిర్యాదులు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీతో దూరమైన పవన్ కల్యాణ్‌తో మాట్లాడి తామ మళ్లీ పొత్తు కోసం ఒప్పించినట్లు సదరు నేతల వర్గం ప్రచారం కూడా మొదలు పెట్టింది. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీలోనూ కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇతర పార్టీలను ఇదే అంశంపై విమర్శించే బీజేపీ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తుండడం గమనార్హం.
Must Read ;- ఆ స్పీడ్ ఇక్కడ లేదే.. సాగర్‌ను బీజేపీ లైట్ తీసుకుందా..?