మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టుకు రంగం సిద్దమైంది. కొద్ది సేపటి కిందట విజయవాడ సమీపంలోని గొల్లపూడిలోని దేవినేని నివాసానికి సీఐడీ అధికారులు చేరుకున్నారు. అయితే దేవినేని ఉమ అందుబాటులో లేకపోవడంతో, ఆయన అనుచరులను, చుట్టుపక్కల వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. దేవినేని ఉమ నాలుగు రోజుల నుంచి క్వారంటైన్ లో ఉన్నారని, అయితే ఎక్కడ ఉన్నదీ తమకు తెలియదని అనుచరులు చెప్పడంతో సీఐడీ అధికారులు వెనుతిరిగారు.
అరెస్టుకు రంగం సిద్ధం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరావు అరెస్టుకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే దేవినేని ఉమ ఎక్కడ ఉన్నదీ తెలియకపోవడంతో సీఐడీ అధికారులు ఆయన కోసం గాలిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వీడియోను దేవినేని మీడియాకు ప్రదర్శించారు. అయితే అది ఫేక్ వీడియో అని కర్నూలుకు చెందిన వైసీపీ నేత, న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ అధికారుల ముందు ఇప్పటి వరకు దేవినేని ఉమ హాజరు కాకపోవడంతో ఆయన అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవినేని ఆచూకీ తెలిస్తే వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనపై కేసు నమోదు..











