తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ..నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాన్ని గెలుస్తామని చెబుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో గెలుపును ప్రస్తావిస్తోంది. అయితే కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తే..బీజేపీ స్పీడు తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ఇస్తున్న ప్రాధాన్యంలో సగం కూడా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఇవ్వడం లేదనే చర్చ మొదలైంది. వాస్తవానికి ఏపీలో పోల్చితే తెలంగాణలోనే బీజేపీకి కొద్దోగొప్పో బలం ఉంది. అలాంటిది నాగార్జునసాగర్‌ను లైట్‌గా తీసుకున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ఎన్నికల ఖర్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానికంగా బీజేపీ వీక్‌గా ఉండడం లాంటి కారణాలు తెరపైకి వస్తున్నాయి.
ముఖ్యనేతల ప్రచారం లేకపోవడం
సామాజిక సమీకరణాల్లో భాగంగా బీజేపీ నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఎస్టీ అభ్యర్థిని ఎంపిక చేసింది. టీఆర్ఎస్ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ ఓట్లే కీలకంగా ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలను దగ్గర చేసుకునే వ్యూహంతో బీజేపీ ఎస్టీ అభ్యర్థిని ఎంపిక చేసిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అభ్యర్థి ఎంపిక వరకు పార్టీ వ్యూహం ఎలా ఉన్నా ప్రచారంలో మాత్రం పార్టీ ముఖ్యనేతలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ తరఫున సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి కీలక నేతలు అప్పుడప్పుడు మినహా పెద్దగా కనిపించకపోవడం పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఇటీవలి వరకు బీజేపీలో ఉండి టిక్కెట్ విషయంలో భంగపాటుకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహ పడ్డాయి. అదే సమయంలో టీఆర్ఎస్‌లో టిక్కెట్ కోసం పోటీ పడిన తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డిలో ఎవరో ఒకరు బయటకు వస్తారని భావించినా.. ముందస్తు హామీతో వారిని టీఆర్ఎస్‌లోనే కొనసాగేలా చూసింది. దీంతో బీజేపీ ఆశలు ఫలించలేదని చెప్పవచ్చు.
నాయకత్వంతో నెట్టుకురావచ్చని..
కాంగ్రెస్, టీఆర్ఎస్‌లతో పోల్చితే ఇక్కడ వ్యవస్థాగతంగా బీజేపీ బలంగా లేకున్నా నాయకత్వంతో నెట్టుకురావచ్చనే వ్యూహం కూడా పెద్దగా ఫలితం ఇచ్చేలా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం దాదాపు 3గంటల పాటు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 9నుంచి ప్రచారం ముమ్మరం చేయాలని, బూత్ స్థాయిలో శక్తి సంఘాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోని ముఖ్యనేతలను ప్రచారానికి వచ్చేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించారు.
అలాంటి ప్రసంగాలు ఏవీ..
ఇక్కడే మరో విషయం కూడా చర్చకు వస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలుకాక ముందే బీజేపీలోని కీలక నేతలు చిన్నచిన్న సభలూ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్‌పై దూకుడుగా వెళ్లారు. వివాదాస్పద ప్రసంగాలూ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి ప్రసంగాలే చేసినా పెద్దగా ఫలితం ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా..వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం బీజేపీ ఐదో స్థానానికి పడిపోయింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని వ్యూహాలు అమలు చేసి గెలిచిందనే విషయం పక్కనబెడితే..సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం బీజేపీకి మైనస్ పాయింట్‌గానే చెప్పవచ్చు. నాగార్జునసాగర్ లోనూ 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఆ ఎన్నికల్లో 2675ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి ఇప్పటికీ పార్టీ బలపడిందని చెబుతున్నా.. కడారి అంజయ్య యాదవ్ బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరడంతో బీజేపీ షాక్ తింది. అది చాలదన్నట్లు ప్రధాన నేతలు అప్పుడప్పుడు తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో బీజేపీ లైట్‌గా తీసుకుందా అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో తిరుపతిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు ప్రచారం చేయడం, బండి సంజయ్ సభ కూడా ఉండనుందనే చర్చ నడుస్తుండడం గమనార్హం.
ALSO READ :బీజేపీకి వరుస షాక్‌లు.. హ్యాండిస్తున్న నేతలు