(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
గంజాయి నుంచి ఆయిల్ తీసి గిరిజన ప్రాంతం నుంచి నగరాలకు తరలిస్తున్నారు. ఈ విధంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించిన విశాఖ ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ తరహా ఆయిల్ రవాణాపై విశాఖ పోలీసులు దృష్టి సారించాల్సి వస్తోంది. మాడుగులకు చెందిన సీడింగి చంద్రమోహన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో మాడుగుల నుంచి ఈ తరహా ఆయిల్ తీసుకు వచ్చాడు. అయితే వ్యక్తి తనతోపాటు గంజాయి నుంచి తయారుచేసిన ఆయిల్ తరలిస్తున్నట్లు ఎయిర్ పోర్టు జోన్ పోలీసులకు అందిన పక్కా సమాచారంలో మర్రిపాలెం పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనం డిక్కీలో ఉన్న రెండు లీటర్ల గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాలిథిన్ కవర్లలో దీన్ని ప్యాక్ చేసి డిక్కీలో పెట్టుకుని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
10ml…@ 2,000/-
గంజాయి నుంచి తీసిన ఈ ఆయిల్ కు హైదరాబాదులో మంచి గిరాకీ ఉందట. సాధారణ గంజాయి ఇచ్చే కిక్కు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ మత్తు కలిగించడంతో… డ్రగ్స్ కు బానిసలైన కొందరు వీటిని ఆశ్రయిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయిల్ హైదరాబాద్ నగరంలో 10 మిల్లీ లీటర్లు రూ. 2 వేలకు పలుకుతుందని పోలీసులు తెలిపారు.
రెండు రకాలుగా వినియోగం…
నేరుగా గంజాయితో పాటు కలిపి తీసుకునేవారు కొందరైతే… స్టైల్ గా సిగరెట్ కాల్చినట్టు.. మత్తును పీల్చే వారు మరికొందరు. ఈ అయిల్ లో సిగరెట్ ను తడిపి వినియోగిస్తే విపరీతమైన కిక్ ఇస్తుందని పోలీసులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల పోలీసులు గుర్తించడం అంత సులభం కాదు. సాధారణ సిగరెట్టు కాల్చినట్లే.. బహిరంగ ప్రదేశాల్లో ఈ ఆయిల్ లో తడిసిన సిగరెట్ ను కాల్చినా పసిగట్టడం సాధ్యం కాదు. ఇక గంజాయ్ కి బానిస అయిన వాళ్ళు.. డ్రై గంజాయి లో దీన్ని కలుపుకొని తీసుకోవడం వల్ల అధిక మత్తును ఆస్వాదిస్తారని పోలీసులు చెబుతున్నారు.
Must Read ;- ఆందోళన కలిగిస్తున్న డ్రగ్ కల్చర్.. విద్యార్థులే టార్గెట్
విద్యార్థులే లక్ష్యంగా…
కళాశాల విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని వీటి విక్రయాలు సాగిస్తున్నట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. ఈ ఆయిల్ ను ద్విచక్ర వాహనాల ద్వారా సులభంగా రవాణా చేసే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్ కాంప్లెక్స్ , రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకు వచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్యాకెట్ల రూపంలో తరలిస్తే పట్టుబడుతున్నారు…
గంజాయ్ ని సాధారణంగా విశాఖ రూరల్ నుంచి కేజీ నుంచి 10 కేజీలు ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి ఆటోలు, లారీలు, క్యాబ్లు, ప్రైవేటు బస్సుల ద్వారా తరలిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ అడుగుభాగాన్ని కట్ చేసి అందులో గంజాయి నింపి తరలిస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయి. ఇక లారీల్లో ప్రత్యేక అరలు నిర్మించి తరలిస్తుండగా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా ద్రవరూపంలో ఉన్న గంజాయ్ ఆయిల్ ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగానే మిగలనుంది.
Also Read ;- ప్రకాశంలో పోలీసుల కళ్లుగప్పి క్రియేటివ్ స్మగ్లింగ్











