(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ మన్యంలో మావోలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, అభివృద్ధికి అవరోధాలు గా మారిపోతున్న మావోయిస్టుల చర్యలతో గిరిజనుల్లో వ్యతిరేకత ఆరంభమైంది. విశాఖ జిల్లా రూరల్ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్, వివిధ వైద్య శిబిరాలు, క్రీడా పోటీల ద్వారా గిరిజనులకు మరింత దగ్గరవుతున్నారు. దీంతో విశాఖపట్నం జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో నెలరోజుల వ్యవధిలోనే 25 మంది మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోయారు.
వివిధ రకాలుగా తోడ్పాటు..
కాఫీ తోటలు సాగు చేసే గిరిజనుల నుంచి మామూళ్లు వసూలు చేసి మావోలకు చేరవేయడం, సంతలో ఇతర రద్దీ ప్రాంతాల్లో మావోలకు అనుకూల కరపత్రాలు పంపిణీ చేయడం, మావోయిస్టులు నిర్వహించే సమావేశాలకు నయానో భయానో ప్రజలను సమీకరించడం, పోలీసుల రాకపోకలు సమాచారాన్ని వారికి చేరవేయడం, మావోయిస్టులు ఏర్పాటు చేసుకునే సమావేశాలకు ఆహారం సరఫరా చేయడం… ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న అనేక మంది సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యులు ఒక్కొక్కరుగా లొంగిపోతుండడంతో మావోయిస్టులకు గడ్డుకాలం ఎదురుగానున్నదని స్పష్టమవుతోంది.
చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో..
చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు మిలీషియా సభ్యులు లొంగుబాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ‘ ప్రేరణ’, సంకల్పం’ వంటి కార్యక్రమాలు వారిని పోలీసులతో మమేకం చేస్తున్నాయి. ఈమధ్య చెరువూరు గ్రామంలో జరిగిన మెగా మెడికల్ క్యాంపు, వాలీబాల్ టోర్నమెంట్ కు భారీ సంఖ్యలో గిరిజన యువత హాజరయ్యారు. గిరిజన ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం వారికి అవసరమైన సదుపాయాల గురించి, సమస్యల గురించి పి.ఓ, ఐటిడిఎ పాడేరు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తున్నారు. దానికి తోడు గత ఐదు నెలల నుంచి ఏరియా కమిటీ మెంబర్ గెమ్మిలి కామేష్ @ కుంకుమపూడి హరి వంటి హార్డ్ కోర్ మిలీషియా సభ్యులు అరెస్టు కావడం వల్ల మావోయిస్టు మిలీషియా సభ్యులకు ఇది ఒక హెచ్చరికగా పని చేసింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ద్వారా గిరిజనులకు మరింత దగ్గరవుతూ వస్తున్నారు. దీంతో మావోయిస్టు మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవడానికి మార్గం సుగమం అవుతోంది. లొంగిపోయిన మిలీషియా సభ్యులు మరలా తాము మావోయిస్టుల తరపున పని చేయబోమని, మనశ్శాంతితో కుటుంబాలతో కలసి జీవిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ లొంగుబాటు ల పర్వం ఇలాగే కొనసాగితే ఆంధ్ర ఒడి ఒడిశా సరిహద్దుల్లో మావోల ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.
Must Read ;- బోర్డుల తొలగింపు.. ముదురుతున్న సరిహద్దు వివాదం