ఏపీకి అక్రమ మద్యం తరలించే ముఠాలు కొత్త మార్గాలను కనిపెట్టాయి. గతంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బ్రాండెడ్ మద్యాన్ని తరలించిన అక్రమార్కులు, నిఘా ఎక్కువ కావడంతో రూటు మార్చారు. తెలంగాణ నుంచి మద్యం తరలించడం కష్ట సాధ్యంగా మారింది. దీంతో ఇక తమిళనాడు, కర్ణాటక, గోవా, హర్యానా నుంచి పెద్ద ఎత్తున అక్రమ బ్రాండెడ్ మద్యం ఏపీకి తరలిస్తున్నారు. తాజాగా గోవా నుంచి 20 వాషింగ్ మెషిన్లలో మద్యం బాటిళ్లు పెట్టి తరలిస్తున్న వ్యక్తిని వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కొత్త మార్గాలపై కూడా సెబ్ సిబ్బంది దృష్టి సారించారు.
సరుకు మాటున
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీ పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న సరకు వివరాలు తీసుకుని మద్యం అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. గోవా నుంచి ఏపీకి ఎలక్టానిక్ వస్తువులు, తమిళనాడు కోయంబత్తూరు నుంచి కూరగాయలు, హర్యానా నుంచి ఆటోమొబైల్ వస్తువులు ఏపీకి పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయి. వీటి మాటున అక్రమార్కులు బ్రాండెడ్ మద్యం ఉంచి తరలిస్తున్నారు. వీటిని తనిఖీ చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. పక్కాగా బిల్లులతో ఉండే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తేగాని మందు బాటిళ్లు బయట పడటం లేదు. ఎంతో పక్కాగా టార్పాలిన్ పట్టలు బిగించి ఓపెన్ చేయడానికి కూడా కష్టంగా ఉండే విధంగా వాహనాలను ప్యాక్ చేస్తున్నారు. ఇలాంటి వాహనాలను చెక్ చేయడానికి ఒక్కో వాహనానికి రెండు గంటల సమయం పడుతోంది. దీంతో చాలా వాహనాలను కేవలం బిల్లులు చెక్ చేసి వదిలేస్తున్నారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది.
గోవా మందు చాలా చౌక
మద్యం అక్రమార్కులు గోవా, పాండిచ్చేరి నుంచి మద్యం తరలిస్తున్నారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున చేపలతో కూడిన వాహనాలు గోవాకు వెళుతున్నాయి. దీంతో ఆ వాహనాలు తిరిగి వచ్చేప్పుడు బ్రాండెడ్ మద్యం తీసుకువచ్చేందుకు వాడుతున్నారని తెలుస్తోంది. గత వారంలో ఏపీ ఎక్సైజ్ అధికారులు అక్రమమద్యం తరలిస్తున్న 12 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 8 వాహనాలు గోవా నుంచి మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. మరో 2 వాహనాలు చెన్నైనుంచి, మరో రెండు హర్యానా నుంచి మద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ని తనిఖీలు చేసినా ఆపలేరా?
ఏపీలో బ్రాండెడ్ మద్యం ధర గోవాతో పోల్చుకుంటే 250 శాతం అధికంగా ఉంది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. పది లక్షల బ్రాండెడ్ మద్యం తెచ్చుకుంటే ఏపీలో దాన్ని 35 లక్షలకు అమ్ముతున్నారు. దీంతో అక్రమ మద్యం ముఠాలు ఇదే పనిగా పెట్టుకున్నాయని తెలుస్తోంది. కొందరు తెలంగాణ చెక్ పోస్టు వద్ద సిబ్బందికి లంచాలు ఇచ్చి అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం కూడా వస్తోంది. గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్టు వద్ద సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని తేలడంతో జిల్లా రూరల్ ఎస్పీ వారిని బదిలీ చేశారు. పోలీసులు, సెబ్ సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమమద్యం రవాణాకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- ఏపీలో మద్యపాన నిషేధం అటకెక్కినట్టేనా ..?











