విశాఖ సాగర తీరంలో శనివారం నుంచి పోలీసు నిఘా పెరగనుంది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక బృందాలు అణువణువునా జల్లెడ పట్టనున్నాయి. మొత్తం నాలుగు బృందాలుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్, ఏ ఆర్, మెరైన్ కమ్యూనిటీ గాడ్స్ తో సాగరతీరం పొడుగునా నేరాల నియంత్రణ మొదలు… వాహనాల క్రమబద్ధీకరణ వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షించనున్నారు.
మొదటి బృందం లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఉంటారు. వీరు ఫిషింగ్ హార్బర్ నుంచి ఐ టి సెజ్ వరకు 19 ప్రదేశాలలో రూఫ్ టాప్ సర్వైలెన్స్ చేస్తారు. వీరి వద్ద ఉండే బైనోక్లర్, డ్రాగన్ లైట్స్, మ్యాన్ పాక్స్ పరికరాలతో భవనాల పై నుంచి బీచ్ రోడ్డును నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఒక్కో రూఫ్ టాప్ పైన ఇద్దరు చొప్పున డ్యూటీ చేస్తారు. రెండవ బృందంలో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు ఏ ఆర్ పోలీసులు 30 ప్రదేశాలలో రోడ్డుపై విధులు నిర్వహిస్తారు. తీరానికి వచ్చే సందర్శకులకు భద్రత, రక్షణ విషయాల్లో ఎలర్ట్ చేస్తుంటారు. ఈ బృందంలో షి టీమ్స్ కూడా పనిచేస్తాయి.
మూడవ బృందంలో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు., బీచ్ రోడ్ లో ఫిషింగ్ హార్బర్ నుంచి 36 ప్రదేశాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ నిర్వహణ పర్యవేక్షిస్తారు. నాలుగవ బృందంలో సిబ్బంది ఇసుక తిన్నెల్లో విధులు నిర్వహిస్తారు. ఈ బృందంలో పూర్తిగా మెరైన్ పోలీసులు, కమ్యూనిటీ గార్డులు ఉంటారు. సముద్రంలో కెరటాల మధ్యలో స్నానాలు చేస్తూ, ఆదమరిచే వారిని అప్రమత్తం చేస్తారు. అలల తాకిడికి ఎవరు కొట్టుకొని పోకుండా సందర్శకులను ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వీరి వద్ద లైఫ్ జాకెట్స్, ఇన్ ప్లేటెడ్ రబ్బర్ ట్యూబ్స్, రోప్స్ ఉంటాయి. ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు సుమారు 190 మంది పోలీసులు ఇతర సిబ్బంది విశాఖ బీచ్ లో సందర్శకులకు రక్షణగా, అండగా నిలవనున్నారు.
వేలాది మంది సందర్శకులు..
విశాఖ సాగర తీరానికి సెలవు రోజుల్లో కనీసం 30 నుంచి 40 వేల మంది సందర్శకులు, స్థానికులు వస్తూ ఉంటారు. వీరికి వాహనాల పార్కింగ్ మొదలు, ఆకతాయిల వరకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ప్రత్యేక బృందాలను నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ సాగర తీరంలో ప్రశాంతంగా ఎంజాయ్ చేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
Must Read ;- ఢిల్లీ లాగా విశాఖలో చేయండి : జగన్ విజ్ఞప్తి











