రాష్ట్రంలో దేవాదాయశాఖ ఉందా లేదా? ఒకవేళ ఉన్న గుడి సంబంధిత విషయాలు పట్టించుకోవడం మానేసినట్టుంది. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. రోజుకో విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు దుండగులు. రాజకీయనాయకులు ఒకరినొకరు తిట్టుకోవడంతో సరిపెట్టుకుంటన్నారు. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులేమో రాజకీయనాయకుల్ని మించి మరీ ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్ మెంట్లు ఇస్తున్నారే తప్ప.. ఆధారాలతో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో మరో ఘటన చోటుచేసుకుంది. వైజాగ్‌లోని సింహాచల శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి గుడిలో అపచారం జరిగింది.
సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి.. కేవలం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశ వ్యాప్తంగా కూడా పేరుంది. అటువంటి గుడి ప్రాంగణంలో నిషిద్ధమైన మద్యం సీసాలు, సిగరెట్లు దర్శనమివ్వడంతో భక్తులు దేవాలయ ట్రస్ట్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది కూడా నిర్లక్ష్యంవహిస్తూ దేవాలయాల ప్రశస్తి దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సింహాచల దర్శనానికి వెళ్లిన భక్తులు అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఆన్ లైన్ పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిబట్టి అక్కడ పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. మరి ఇప్పటికైనా.. ప్రభుత్వం, దేవాదాయశాఖ, ఆలయ పాలకమండలి చర్యలు చేపడతారేమో వేచి చూడాలి.