ఫిబ్రవరిలో స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, ఎస్ఈసీ ప్రకటనపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా అందుకు నిరాకరించింది. ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది మధ్య వాడీ వేడి వాదనలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్ తిప్పికొట్టారు. ఎన్నికల నిర్వహణపై మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని ఆయన తెలిపారు.సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తే, ఆ కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించిన అశ్విన్ కుమార్,రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయనే సుప్రీంను ఆశ్రయించకుండా హైకోర్టును ఆశ్రయించారని వాదించారు.అశ్విన్ కుమార్ వాదనలతో డిఫెన్స్‌లో పడ్డ ప్రభుత్వ న్యాయవాది సరికొత్త వాదనలు వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో కేసును రేపటికి వాయిదా వేశారు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగా, కరోనా కారణంగా అప్పుడు నిర్వహించలేమని సీఎస్ నీలం సాహ్ని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించటం లేదని ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్ఈసీ ప్రకటనపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా అందుకు నిరాకరించింది.
Must Read ;- మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు