ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. ఆయన పేరుకు పదవిలో ఉన్నారు గానీ.. ఆయనను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గొడవ పెట్టుకున్నా- తిరిగి గొడవ పడవచ్చు గానీ.. అసలు ఆయన పెద్దరికాన్ని గుర్తించకుండా అలక్ష్యం ప్రదర్శించడం అనేది ఆయనకు అత్యంత అసహనం కలిగిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ఆయన పట్ల నిర్లిప్తంగా ఉండగా, మరోవైపు వైసీపీ నాయకులు, మంత్రులు తీవ్రమైన, అసభ్యమైన భాషతో తిట్టిపోస్తుండడం కూడా ఆయనకు కోపం తెప్పిస్తోంది. కోర్టుకు వెళ్లే మార్గం ఆయనకుంది గానీ.. గురువారం మరోసారి ఆయన రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఎవ్వరూ పట్టించుకోలేదు..
ఎన్నికల నిర్వహణ నిమిత్తం కలెకర్లు, జిల్లా పరిషత్ సీఈవోలతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడానికి సమయం నిర్ణయించి.. ఆ మేరకు ఉత్తర్వులు పంపితే దాన్ని ఎవ్వరూ ఖాతరు చేయలేదు. నిజానికి ఆయన బుధవారం మధ్యాహ్నమే ఈ సమావేశం ఏర్పాటుచేసి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి సమాచారం పంపారు. ఆమె దాన్ని పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదు అనే లేఖ రాసి ఊరుకుంది. కలెక్టర్లు ఎవరూ రాకపోవడంతో.. ఈసీ అనుకున్న సమావేశం రద్దయింది.
గురువారం ఉదయం 10 గంటలకు మళ్లీ ఆయన అదే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ సీఎస్ కు సమాచారం పంపారు. ఆమె మళ్లీ నిర్లిప్తత వహించారు. మళ్లీ కలెక్టర్లు ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ రద్దయింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారితీస్తాయంటూ ఆయన ఈ విషయాన్ని గవర్నరుకు ఫిర్యాదు చేయనున్నారు.
Must Read ;- తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?
మంత్రుల వ్యాఖ్యలు బాధించాయా..
వైసీపీ నాయకులు, ప్రధానంగా మంత్రులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఎడాపెడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొడాలి నాని రాయడానికి వీల్లేని భాషలో ఆయనను తిట్టిపోశారు. పేర్నినాని వంటి మంత్రులు కూడా అంతకు తీసిపోని మాటలతోనే నిందిస్తున్నారు. ఈ మంత్రులందరి మీద కూడా గవర్నరుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
కోర్టుకు కూడా వెళ్తారా?
ప్రభుత్వం తన ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ.. నిమ్మగడ్డ మళ్లీ ఓసారి కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. అంతవరకూ వెళితే ఏం జరుగుతుంది? ఈసీ ఎప్పుడు చెబితే అప్పుడు.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనా? అనే వ్యవహారాలు అప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read ;- నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్











