కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని అది పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం పార్లమెంటు స్థానాల వారీగా 25 జిల్లాలతో పాటు, అరకును ప్రత్యేకంగా గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త జిల్లాలను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, స్ధానిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడనుందని తెలుస్తోంది.
ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకూ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దంగా లేకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీకాలం వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉంది. ఆ తరవాత నిమ్మగడ్డ స్థానంలో కొత్త కమిషనర్ ను నియమించుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉంది. మార్చి తరవాత అనుకూలంగా వ్యవహరించే వారిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read:- కొత్త జిల్లాల విషయంలో జగన్ మాట తప్పినట్టేనా?)
డిసెంబర్ లో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందా?
ఏపీలో కరోనా కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను డిసెంబరులో ప్రారంభించి జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరిలో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందా? లేదా? అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తేల్చనున్నారు. ఇక ఇప్పటికే స్థానికంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి.
అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి మరలా ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారని భావిస్తున్నారు. ఏది ఏమైనా మార్చి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం, ఫిబ్రవరిలోగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ల మధ్యపోటీ ఎటుదారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read ;- జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ