ఈరోజు (మంగళవారం) చాలా కీలకమైన రోజు. నిన్న తెలుగుదేశానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేసిన నేపథ్యం, అర్ధరాత్రి పంటల బీమా ప్రీమియం చెల్లిస్తూ ఉత్తర్వులు ఇచ్చేసిన వైనం.. ఈ నేపథ్యంలో నిన్నటిలాగే ఇవాళ కూడా శాసనసభలో జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ, హావభావాలతో విపక్షనాయకులను ఎద్దేవా చేస్తూ ఉండే సమయానికి- ఆయన గురించి సుప్రీం న్యాయస్థానం ఏం చెబుతుందనే సంగతి ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే.. సుప్రీం న్యాయమూర్తికి, జడ్జిలకు వ్యతిరేకంగా ఆయన రాసిన లేఖను బహిర్గతం చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారించనుంది.
నేడు సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, పైపెచ్చు దాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దిమేష్ మహేశ్వరి, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది.
న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ సహా యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వారు విడివిడిగా జగన్ కు వ్యతిరేకంగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
Must Read: alert : పెద్దిరెడ్డి తండ్రీకొడుకులపై జగన్ నిఘా నేత్రం!
న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ మీడియా సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ వేశారు. న్యాయస్థానాలపై భవిష్యత్ లో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్లో డిమాండ్ చేశారు. ఆ రకంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ సీఎం జగన్ కు షోకాజు నోటీసులు ఇవ్వాలని కూడా సునీల్ కుమార్ సింగ్ తన పిటిషన్లో కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఏపీ సీఎంగా జగన్ ను తొలగించాలంటూ జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ సుప్రీంకోర్టులో వేరే పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత ప్రయోజానాల కోసం సీఎం పదవికి అపకీర్తి తెస్తూ న్యాయమూర్తిపై బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేశారని వారిద్దరూ తమ పిటిషన్లో ఆరోపించారు.
ఇకపోతే యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వారి పిటిషన్లో.. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి, బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్, సలహాదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మూడు పిటిషన్లను ఉమ్మడిగా విచారించనున్నారు. నిజానికి ఈ కేసులు రెండు వారాల కిందటే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి. అయితే అప్పటి త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ లలిత ఈ విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు.. ఈ కేసులో పార్టీలుగా ఉన్న కొందరి తరఫున వాదించానని, అందుకే ఈ కేసును విచారించనని, నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన తప్పుకోవడంతో ఇవాళ్టికి వాయిదా పడింది.
ఇవాళ మరో త్రిసభ్య ధర్మాసనం ఎదుట జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలతో సీజేకు లేఖ రాయడం ఒక ఎత్తు అయితే.. దానిని బహిర్గతం చేయడాన్ని మాత్రం.. న్యాయనిపుణులందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి చర్య తప్పు అని అనేక మనంది న్యాయకోవిదులు పేర్కొన్నారు. ఆ వ్యవహారం మీద దాఖలైన పిటిషన్ల మీదనే ఇవాళ విచారణ జరగనుంది. జగన్ అసెంబ్లీలో లైవ్ కవరేజీల్లో ఉండగానే.. సుప్రీంలో విచారణ.. నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉండడం యాదృచ్ఛికం కావొచ్చు.
Also Read: chandrababu sensational decession on amravati protest