ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ పరమైన అవసరమని ప్రభుత్వ సీఎస్ కు నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని కమిషనర్ గుర్తుచేశారు.
ఎన్నికలకు నెల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశించారు. 15వ ఆర్థికసంఘం నిధులు రావాలంటే ఎన్నికలు తప్పనిసరిని ఆయన గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ లో కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నిమ్మగడ్డ గుర్తుచేశారు.
పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజుకు పదివేల కరోనా కేసుల నుంచి రోజుకు 735 తగ్గిపోయాయని నిమ్మగడ్డ గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read ;- ఎన్నికల సంఘంపై హైకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదు
స్థానిక ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్దంగా ఉందా అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ సీఎస్ కు లేఖ పంపారు. దీనిపై ప్రభుత్వ సీఎస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ ను కలసి, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని తెలిపారు.
అయినా ముందుకే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని కమిషనర్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలకు ఏర్పాట్లు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల కమిషన్ మధ్య నెలకొన్న వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read ;- అంతా సందిగ్ధం : స్థానికంలో ఏకగ్రీవాలన్నీ రద్దువుతాయా?











