ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ* కేసులో తాజాగా కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అనే వ్యక్తికి సీబీఐ కోర్టు ఊరట కలిగించింది. ఈ పరిణామం వివేకా కేసులో పోరాడుతున్న ఆయన కుమార్తెకు కూడా చాలా ప్లస్ అవ్వనుంది. దస్తగిరి వివేకా కేసులో తొలుత నాలుగో నిందితుడిగా ఉండేవాడు. వివేకా హ* కోసం తానే గొడ్డలి కొనుగోలు చేశానని.. వివేకాపై ఒక గొడ్డలి దెబ్బ కూడా వేశానని ఒప్పుకున్నాడు. అలా అప్రూవర్ గా మారాడు. అలాంటి ఇతణ్ని నిందితుల జాబితా నుంచి కోర్టు తొలగించింది. నిన్న మొన్నటి వరకు ఈ కేసులో దస్తగిరిని నాలుగో నిందితుడిగానే పరిగణించారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని పిటిషన్ వేయడంతో దస్తగిరికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
దీంతో వివేకా దారుణ హ* కేసు కీలక మలుపు తిరిగినట్టేనని న్యాయవాదులు అంటున్నారు. కడప జిల్లా పులివెందులకే చెందిన వ్యక్తి దస్తగిరి.. వివేకానంరెడ్డికి అప్పట్లో డ్రైవర్‌గా పనిచేశారు. అయితే, రూ.30 కోట్ల ఆశ చూపి.. వివేకా హ*లో ఇతణ్ని వాడారు. అప్రూవర్ గా మారిన తర్వాత వైఎస్ భాస్కరరెడ్డి, గంగిరెడ్డిలపై దస్తగిరి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హ* కేసు హైదరాబాద్‌కు బదిలీ కాకముందే దస్తగిరిని కడప కోర్టు అప్రూవర్‌గా గుర్తించింది.
సీబీఐ చార్జిషీట్‌లో ఇప్పటికే దస్తగిరి పేరును సాక్షిగా మాత్రమే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో ఫైల్ అయిన కేసులోనూ తనను నిందితుడిగా కాదు.. సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరుతూ.. కొన్నాళ్ల కిందటే నాంపల్లి సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశాడు. దీనిని పలుమార్లు విచారించిన కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అప్రూవర్‌గా మారినందున.. సీబీఐ సైతం దస్తగిరిని సాక్షిగానే పేర్కొన్నందున తాము కూడా అతనిని సాక్షిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఈ విషయం సునీతా రెడ్డికి ఎంతో కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దస్తగిరికి ఆ బెయిల్‌ను రద్దు చేయాలని.. జైలుకు పంపాలని కోరుతూ గతంలోనే సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ దశలో ఉన్న సమయంలో అసలు దస్తగిరి నిందితుడే కాదని, సాక్షిగా పరిగణిస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక సునీత తన పిటిషన్ విత్ డ్రా చేసుకుంటుందని భావిస్తున్నారు. దస్తగిరి ప్రత్యక్ష సాక్షి కావడంతో ఇక కోర్టులో జరిగింది మొత్తం చెబుతాడు.. కాబట్టి, ఇక వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ కేసులో మరింత ఇరుక్కోబోతున్నారని అంటున్నారు.











