యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ మొదలైన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్క్ ల వాడకం, శానిటైజర్ల వాడకం ఎలా పెరిగిందో అంచనాలకు కూడా అందడం లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో కనీసం ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ వేసుకోవడం లేదు. కనీసం శానిటైజర్ ను కూడా ఉపయోగించడం లేదు. అసలు వారికి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలుసా లేదా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ ఆ దేశం ఏమిటో ఎక్కడ ఉందో తెలుసుకుందామా.. మంగోలియా! ఇది ఎక్కడో లేదండి.. చైనాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతమే. అయినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ ఒక్క కొవిడ్ మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం మంగోలియాలో అసలు కరోనా కేసులనేవే లేవు.
ఎలా సాధ్యమయ్యిందంటే..?
చైనాలో లాక్ డౌన్ విధించిన వెంటనే మంగోలియా తన సరిహద్దులన్నింటినీ మూసి వేసింది. బయట వారిని ఎవరిని కూడా మంగోలియా లోనికి రానివ్వలేదు. చాలా తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయినప్పటికీ వారు వెంటనే కోలుకోవడంతో కరోనాను మంగోలియా నుంచి తరిమి కొట్టారు. దేశంలోకి ఎవరు వచ్చినా సరే.. పూర్తిగా ఐదు వారాల పాటు క్వారింటైన్ లో ఉండేలా ఖచ్చితంగా పాటించారు. స్కూళ్లు, సినిమా హాళ్లు, పబ్ లు అన్నింటిని పూర్తిగా మూసివేశారు. ఐదు వారాల పాటు వ్యాపార సంస్థలు అన్ని మూతబడటం అంటే మాటలు కాదు. కానీ వారు బెదిరిపోలేదు. కేవలం తమ పూర్వీకులు పాటించిన, నేర్పిన నియమాలను పాటించి కరోనాను మంగోలియా నుంచి తరిమి కొట్టారు. దీనికి అంతటికి కారణం తమ పూర్వీకుడు ఛెంఘీజ్ ఖాన్ అంటున్నారు మంగోలియా వాసులు.
ఎవరీ ఛెంఘీజ్ ఖాన్..
మంగోలియా సామ్రాజ్య వ్యవస్థాపకుడే ఛెంఘీజ్ ఖాన్. మంగోలియా ప్రపంచంలోనే అతి పెద్ద ఏక ఖండ సామ్రాజ్యం. తాను ఉన్నప్పటి నుంచి కూడా మంగోలియా ప్రజలకు ఆహార, నివాస తదితర విషయాల్లో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలే ఇప్పుడు మంగోలియా నుంచి కరోనాను తరిమికొట్టేలా ఉపయోగపడ్డాయి అంటున్నారు అక్కడి ప్రజలు.
స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం. స్థానికంగా దొరికే వాటితోనే వస్త్రాలను తయారు చేసుకోవడం వంటివి ఛెంఘీజ్ ఖాన్ నుంచి తెలుసుకున్నామంటున్నారు మంగోలియా వాసులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘బాగా పుష్టిగా తిను.. అత్యంత సాధారణంగా జీవించు..’ అనేదే చెంఘిజ్ ఖాన్ జీవిన విధానం- నినాదం కూడా! అదే మంగోలియన్ జీవన శైలి అయింది. ప్రపంచంలోనే అత్యంత బలాఢ్యులైన, ఆరోగ్యకరమైన వారిగా వారికి గుర్తింపు ఉంది. దానికి తగ్గట్టుగానే మంగోలియా కరోనా మహమ్మారిపై విజయం సాధించడంలో కూడా అందరికంటె ముందుంది.
అందుకే కరోనాను తమ దేశం నుంచి కేవలం ఐదు వారాల్లోనే తరిమి కొట్టాం అంటున్నారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సినిమా హాళ్లను తెరిచాము. అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయని అక్కడ ప్రజలు పేర్కొంటున్నారు.
ఇప్పుడు కరోనా మహమ్మరి మా వద్దకు వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ తెలుపుతున్నారు. ప్రపంచ దేశాలు మంగోలియాను చూసి నేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. వారు అనుసరించిన విధానాలనే అనుసరిస్తే కరోనాను ప్రపంచం నుంచి తరిమి కొట్టడం చాలా సులభం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంగోలియా లాంటి జనాభా తక్కువగా ఉండే దేశానికి, అంతర్జాతీయ రాకపోకలు పరిమితంగా ఉండే దేశానికి ఇది సాధ్యమవుతుందేమో గానీ.. భారత్ లాంటి అతిపెద్ద దేశాలకు ఇదే సూత్రం వర్తిస్తుందా? అనేది ఆలోచించాల్సిన సంగతే!