ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, రవాణాలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఉండేలా నూతన పాలసీని తీసుకు వచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇసుక అమ్మకాలను కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలకు అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం మొదట సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఒక్కటి కూడా ముందుకు రాకపోవడంతో ప్రయివేటు సంస్థలకు అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది.
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదించింది. రాష్ట్రం మొత్తం ఇసుక తవ్వకాలు, సరఫరా మొత్తం ఒకే సంస్థకు అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక నుంచి వినియోగదారులకు చౌకగా ఇసుక లభించనుంది.
ధరలు నిర్ణయించేది ప్రభుత్వమే
ఇసుక తవ్వకాలు, సరపరా ప్రయివేటు సంస్థకు అప్పగించినా వారిష్టం వచ్చిన రేటుకు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వినియోగదారులకు ఇసుక అందించాల్సి ఉంది. టెండర్లు పిలవడం ద్వారా ఇసుక తవ్వకాలు, సరఫరాను అప్పగించాలని నిర్ణయించారు. ధరలను ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక అందేలా ఇసుక పాలసీని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇసుక కన్నా రవాణా ఛార్జీలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి కొత్త పాలసీలో ఉండదు. రీచ్ ల వద్దే వినియోగదారులు తెచ్చుకున్న వాహనంలో ఇసుకను లోడ్ చేస్తారు. తద్వారా వినియోగదారుడు నాణ్యమైన ఇసుకను ఎంచుకోవడంతోపాటు, ఇసుక రవాణా ఛార్జీలు కూడా ఉండవు కాబట్టి తక్కువ రేటుకే ఇక నుంచి ఇసుక దొరికే అవకాశం ఉంది. రీచ్ కు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారు ఎద్దుల బండ్లలో తీసుకువెళ్లేట్లయితే ఇసుక ఉచితంగా కూడా ఇస్తారు.
క్యాబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు
రాష్ట్రంలోని ఫైర్ డిపార్ట్మెంట్ ను నాలుగు జోన్ లుగా విభజించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అగ్నిమాపకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మచిలీపట్నం ఓడరేవు డీపీఆర్ పైనా క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు, స్థానిక సంస్థలపై కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చింది. అయితే వీటిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.











