ఈ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ మంగళవారం జరిగే మ్యాచ్‌లో తలపడబోతున్నాయి.
కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా గెలుపొందిన ఢిల్లీ జట్టు రెండో మ్యాచ్‌లో చెన్నైను సునాయాసంగా ఓడించింది. రాజస్థాన్‌తోపాటు ఈ సీజన్‌లో ఓటమి ఎరుగని టీమ్‌గా నిలిచింది. మరోవైపు హైదరాబాద్ వరుస ఓటములతో నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. బెంగళూరు, కోల్‌కతాలతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో మ్యూడో మ్యాచ్‌లోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని వార్నర్ సేన కృత నిశ్చయంతో ఉంది. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
ఢిల్లీ టీమ్ బలాలు
ఈ సీజన్‌లో ఢిల్లీ టీమ్ ఆటగాళ్లందరూ సానుకూలంగా ఆడుతున్నారు. సమష్టి ప్రదర్శనతో ఆదరగొడుతున్నారు. పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరోవైపు రబాడా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాతో కూడిన బౌలింగ్ విభాగం బంతితో మాయ చేస్తోంది. వరుస విజయాలు ఇస్తున్న ఉత్సాహంతో టీమ్ మొత్తం సానుకూల దృక్పథంతో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ టీమ్‌ను ఓడించడం ప్రత్యర్థి టీమ్‌కు సవాలే.
బలహీనతలు
ఢిల్లీకి మిడిలార్డర్ సమస్య కొనసాగుతూనే ఉంది. టాప్ ఆర్డర్ రాణిస్తున్నా మిడిలార్డర్ నుంచి సహకారం లేకపోవడంతో భారీ స్కోర్లు సాధ్యమవడం లేదు. ఆ సమస్యపై ఢిల్లీ టీమ్ దృష్టి సారించాల్సి ఉంది. అలాగే పేస్ బౌలింగ్ విభాగంలో రబాడాకు సహకారం కరువైంది. ఇషాంత్, మోహిత్ వంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు.
ఢిల్లీ టీమ్ (అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్, హెట్‌మెయర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, నోర్ట్జే, అవేశ్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బలాలు
ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌లకు విలియమ్సన్ దూరమయ్యాడు. ప్రస్తుతం ప్రపంచపు అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఒకడైన విలియమ్సన్ చేరిక హైదరాబాద్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గే వంటి బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి వస్తే హైదరాబాద్ గాడిన పడినట్టే. ఏస్ బౌలర్ భువనేశ్వర్ చక్కని ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు.
బలహీనతలు
ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇది కచ్చితంగా టీమ్ ప్రదర్శనపై ప్రభావం చూపే అంశమే. విధ్వంసకర డేవిడ్ వార్నర్ ఫామ్‌లో లేకపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. నికార్సయిన ఆల్‌రౌండర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మిడిలార్డర్ వైఫల్యం కూడా ఇబ్బందిపెడుతోంది. అలాగే ప్రముఖ బౌలర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమవడం హైదరాబాద్‌కు ఇబ్బందికరంగా మారుతోంది.
హైదరాబాద్ జట్టు (అంచనా)
బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా, అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్.
మ్యాచ్ ఫేవరెట్
పాయింట్ల పట్టికల్లో అగ్ర స్థానంలో ఉన్న జట్టు, చివరి స్థానంలో ఉన్న జట్టు తలపడుతుంటే మ్యాచ్ ఫేవరెట్‌గా కచ్చితంగా టాప్ టీమ్ పేరునే చెప్పాలి. కానీ, ఇది టీ-20 మ్యాచ్. ఏదైనా జరగొచ్చు. వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మనీష్ పాండే వంటి మ్యాచ్ విన్నర్లలో ఎవరైనా ఇద్దరు రాణిస్తే హైదరాబాద్ దశ మారే ఛాన్స్ ఉంది. అలా రాణిస్తే అప్రతిహతంగా దూసుకుపోతున్న ఢిల్లీ టీమ్‌కు పరాజయం తప్పదు.