(మేడ్చల్ నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
హైదరాబాద్ మహా నగరానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా భూభాగోతాలకు అడ్డాగా మారింది. ‘రియల్’ భూమ్‌తో ఇక్కడ ఎకరా కోట్లల్లో ధర పలుకుతోంది. దీంతో అక్రమార్కులు తమ అక్రమాలకు తెరలేపారు. రియల్ భూమ్‌తో భూకబ్జాలు, నకిలీ పత్రాలు, భూ సమస్యల పరిష్కారాల సర్టిఫికెట్లు, వ్యవసాయ భూమి మార్పు పనులు,స్థిర ఆస్తి మార్పులు లాంటి రెవెన్యూ పనులలో దళారీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. దళారీ వ్యవస్థకు మద్దతు పలుకుతూ ఇప్పటికే కొందరు అధికారులు కూడా కుమ్మక్కు అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తహసీల్దారు కార్యాలయాలు కూడా అవినీతిపరులకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఇద్దరు తహసీల్దార్లు అవినీతి కేసులో ఏసీబీ అధికారులకు చిక్కగా మరో తహసీల్దార్ తన కార్యాలయంలోనే సజీవ దహనమైన విషయం తెలిసిందే.
కీసర తహసీల్దారు వ్యవహారం
భూవివాదాన్ని పరిష్కరించేందుకు రూ 1.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారుల భూమిని రియల్టర్ కు అప్పగించేలా పేపర్లను తయారు చేసిన నాగరాజు 2 కోట్లు లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులు తేల్చారు. భారీ మొత్తంలో నగదు చేతులు మారుతుందనే పక్కా సమాచారంతో తమకు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రియల్టర్ అంజిరెడ్డి గెస్ట్ ఆఫీస్ పై దాడి చేసి నాగరాజు, శ్రీనాథ్ యాదవ్, అంజిరెడ్డిని పట్టుకున్నారు. ఈ విషయంలో చొరవ చూపిన ఏసీబీ అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో జీతం రూపంలో నాగరాజు అంత మొత్తం తీసుకుని ఉండరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘జీతం’ కంటే ‘గీతం’ కావాలని ఆశ పడ్డ ఎంఆర్ఓ అత్యాశ అతని మెడకు ఉచ్చుగా మారింది.
తీగ లాగితే డొంక కదిలినట్లు
తీగ లాగితే డొంక కదిలినట్లు అనే నానుడిని రుజువు చేసేలా షేక్‌పేట తహసీల్దార్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భూ వ్యవహారంలో ఏసీబీ అధికారులు రెవిన్యూ అధికారి నాగార్జునను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నాగార్జునను విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఈ కేసులో కీలక పాత్ర పోషించారని గుర్తించారు. ఈ వ్యవహారంలో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు ప్రశ్నించడంతో పాటు ఆమె నివాసంలో తనిఖీ చేశారు. రూ.30 లక్షల నగదుతో పాటు భారీ ఎత్తున బంగారు ఆభరణాలను చేజిక్కించుకున్నారు.
సంచలనం కలిగించిన ఎంఆర్ఓ సజీవదహనం కేసు
దేశ వ్యాప్తంగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహన ఘటన సంచలనం రేపింది. తమకు సంబందించిన భూమిని అమ్మాలనే ఉద్దేశంతో నరేష్ అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ పని పూర్తికాకపోవడంతో ఆ వ్యక్తి మానసిక వేదనకు గురైయ్యారు. లంచం కోసం వేధించడంతో ఆ వ్యక్తి తహసీల్దార్ కు నిప్పటించారని వార్తలు వినబడ్డాయి. ఈ కేసులో పోలీసు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది.
వరుస ఘటనల నేపథ్యంలో రెవిన్యూ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఓ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రెవిన్యూ శాఖను తొలగిస్తామని ప్రకటన కూడా చేశాడు. ఒకరిద్దరు చేసే తప్పుడు పనులకు రెవిన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని అధికారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ తీరు మార్చుకోని అధికారులు అక్రమ సంపాదనపై ఆశ పడుతూనే ఉన్నారు. ఇలాంటి కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. బయట పడని అక్రమాలు ఎన్నో ఉన్నాయని సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.











