పసుపు పండుగను తెలుగుదేశం శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఏటా మహానాడును ఒక వేడుకగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒమన్ రాజధాని మస్కట్‌లో ఎన్ఆర్ఐ టీడీపీ ఒమన్ విభాగం ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.
ఒమన్‌లోని అంబేద్కర్ సేవాసమితి డప్పు వాయిద్యాల నడుమ ఒమన్ కౌన్సిల్ సభ్యులు నృత్యం చేస్తూ కేరింతలు కొడుతూ.. మహానాడు, అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రెండింటిని వైభవంగా నిర్వహించారు.తొలుత అన్న ఎన్టీఆర్ చిత్రపటం వద్ద టిడిపి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగుతల్లికి మల్లె పూదండ పాటతో మహానాడు ప్రారంభం కాగా, జాతరో జాతర… తెలుగుదేశం జాతర.. అంటూ ఆహుతులు తమ వేదికపైకి వచ్చి ఆనందంతో నృత్యాలు చేశారు.
ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్య, ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగుయువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రవాసాంధ్రులంతా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాక్షసపాలనను అంతమొందించేందుకు ప్రవాసులు తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టి తనతో సహా లక్షలాదిమంది పొట్టచేతబట్టుకొని ఖండాంతరాలు దాటి వచ్చామని, నేడు ఒక మూర్ఖుని పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుంటే భరించలేక ప్రవాసాంధ్రులను చైతన్యవంతం చేయాలని ఇక్కడకు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్య తెలిపారు. అన్న ఎన్టీఆర్ జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని.. మోసపుమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళలో యువతకు మటన్, చికెన్ షాపులు, సారా కొట్లలో ఉద్యోగాలిచ్చాడని దుయ్యబట్టారు. పరిపాలనదక్షుడైన చంద్రబాబు హయాంలో యువత ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకు తిరిగే పరిస్థితులు కల్పించారని అన్నారు.











