అధికారంలో ఉన్న పార్టీ తన పాలనలో జరిగే పొరపాట్లపై విపక్షాల ప్రశ్నలను సహించలేవు. గతంలో అయితే కొన్ని ప్రభుత్వాల్లో ఇది కనిపించినా.. మెజారిటీ ప్రభుత్వాల్లో ఈ తరహా ఈ దుస్సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ కుసంస్కృతికి తన దరి చేరనివ్వకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కల్లకుంట్ల తారకరామారావు అందరికీ ఆదర్శంగానే నిలుస్తున్నారని చెప్పాలి. సీఎం కుమారుడిగా, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్న కేటీఆర్.. తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే అక్కడికక్కడే ఆ తప్పును ఒప్పుసుకుంటున్నారు. గతంలో చాలా సార్లు ఇలాగే వ్యవహరించిన కేటీఆర్ తాజాగా తప్పు అధికారులు, కాంట్రాక్టర్లదే అయినా.. ఆ శాఖ మంత్రి ఉన్న తనదే బాధ్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేక్కడో బయట మాట్లాడిన మాట కాదు. సాక్షాత్తు అసెంబ్లీలో కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్షాల నోళ్లను మూయించేశారు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఆయా కాలనీల్లో ఇంకా వరద నీరు తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో ఈ వరద నీటిలో ముందుకు సాగుతూ ముగ్గురు వ్యక్తులు నాలాల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో ఒకటి మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరద నీటిలో మునిగిపోయిన నాలాలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నగరవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలు అయితే అవకాశం దొరికిందన్నట్లుగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్దాయి. వరద నీటిలో కష్టాలు పడుతున్న తమను ఆదుకునేందుకు కేటీఆర్ రాలేదే అంటూ.. కేటీఆర్ మిస్సింగ్ పేరిట పోస్టర్లు కూడా వెలిశాయి. వీడియోలూ వైరల్ అయ్యాయి.
బాధ్యత కేటీఆర్‌దేనట
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో ఈ ఘటనలపై అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే విపక్షాలు ఆందోళనకు గురయ్యాయనో, తాను కనిపించలేదంటూ పోస్టర్లు వెలిశాయనో కాదు గానీ.. ఆ ఘటనలు కేటీఆర్‌ను కూడా బాగానే కలవరపెట్టినట్టున్నాయి. దీంతో శుక్రవారం నాటి సమావేశాల్లో భాగంగా ఈ అంశంపై మాట్లాడిన కేటీఆర్.. బాధ్యత అంతా తనదేనని ఒప్పేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఏమన్నారంటే.. ‘‘మణికొండలో నాలాలో పడి వ్యక్తి మరణించిన ఘటనలో బాధ్యత మాదే. ప్రమాదంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉన్నా మంత్రిగా బాధ్యత నాదే. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకున్నాం. శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అంటూ కేటీఆర్ ఏమాత్రం బేషజం లేకుండా ఒప్పేసుకున్నారు. దీంతో సభలోని విపక్షాల సభ్యులంతా అలా చూస్తుండిపోవడం మినహా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.
Must Read ;- అరెరె.. కేటీఆర్ బుక్కయ్యారే