పాన్ ఇండియా సినిమా- ఏ ముహూర్తాన ఈ పేరు వెలుగులోకి వచ్చిందోగానీ అంత భారీ బడ్జెట్ తో పలు భాషల్లో రూపొందే సినిమాల విడుదల పెద్ద తలనొప్పిగా మారింది. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సీజన్ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి మాత్రమే. కరోనా వల్ల షూటింగులు పూర్తయి విడుదల కాకుండా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాల పరిస్థితి మరోలా ఉంది. మహారాష్ట్రలో థియేటర్లు ప్రారంభం కాకపోవడంతో ఆ సినిమాల విడుదలను కూడా వాయిదా వేశారు.
తాజాగా అక్టోబరు 22 నుంచి థియేటర్లు ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాంతో హిందీ సినిమాల విడుదలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలను విడుదల చేయడానికి ఎవరూ సిద్దంగా లేరు. అందువల్ల వచ్చే సంక్రాంతి అయితేనే అందరికీ బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ గా ముందుకు వెళుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది ట్రిపుల్ ఆర్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి రూపొందించిన భారీ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ క్రిస్మస్ కు విడుదలవుతుంది అంటున్నారు కాబట్టి ట్రిపుల్ ఆర్ ను వచ్చే జనవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారన్న వార్త బయటికి వచ్చింది. అయితే పుష్ప విడుదల క్రిస్మస్ కు సాధ్యం కాదని వార్తలు రావడంతో వీలైతే అదే సమయానికి ట్రిపుల్ ఆర్ విడుదల చేస్తే బాగుంటుందన్న ఓ అభిప్రాయం ఉంది. క్రిస్మస్ నుంచి జనవరి 21 వరకూ ఆరుగురు పెద్ద హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. షాహిద్ కపూర్ జెర్సీ డిసెంబరు 31న స్లాట్ బుక్ చేసింది. ఆ తర్వాత ఆలియాభట్ ప్రధాన పాత్ర పోషించిన గంగూబాయి కథియావాడి జనవరి 6న విడుదల కానుంది. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14 అంటున్నారు.
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి. సంక్రాంతి మీదనే అందరూ దృష్టిపెట్టడం ఇబ్బందికరంగా మారింది. మహేష్ బాబు సినిమా విడుదలను వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ దాటితే ఇక మిగిలింది వేసవి మాత్రమే. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే అందరి గురి సంక్రాంతి బరిమీదనే ఉంది. ట్రిపుల్ ఆర్ విడుదలకు సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- మెగాస్టార్ మూవీలో రవితేజ.. ఇది నిజమేనా?











