ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రంలో వరుస కల్లోలాలు నమోదయ్యాయి. తొలుత రాజకీయ సంక్షోభం నెలకొనగా.. ఆ కల్లోలం చల్లారిందని అనుకునే లోపే వరదలు ఆ రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. సరిగ్గా.. గుజరాత్ కు కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే గుజరాత్ ను వరదలు అతలాకుతలం చేశాయి. ప్రదానంగా గుజరాత్ లో పారిశ్రామిక కేంద్రంగా జామ్ నగర్ తో పాటు రాజ్ కోట్ లలో వరదలు బీభత్సాన్నే సృష్టించాయి. వరదల తాకిడికి జామ్ నగర్ పారిశ్రామిక వాడలోని పలు లగ్జరీ కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ గా మారాయి. వర్షాలన్నాక వరదలు కామనే అయినా.. ఇప్పుడు గుజరాత్ ను అతలాకుతలం చేస్తున్న వరదలకు ప్రత్యేకత ఉందనే చెప్పాలి.
తొలి అడుగుతోనే సీఎం పోస్టు
మూడు రోజుల క్రితం శనివారం నాడు గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న విజయ్ రూపానీ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసేశారు. తన రాజీనామాను ఆయన నేరుగా గవర్నర్ కు అందజేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో.. అదీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయనగా.. బీజేపీకి చెందిన సీఎం రాజీనామా చేయడం నిజంగానే కలకలం రేపింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. ఆ జాబితాలో రూపానీది నాలుగో స్థానం. అయితే ఎన్నికల ముందు బలమైన నేత కోసమే బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే రూపానీ రాజీనామా చేశారన్న కోణంలో విశ్లేషణలు సాగాయి. రూపానీ ప్లేస్ ను ఎవరితో భర్తీ చేస్తారన్న దిశగా పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అసెంబ్లీకి తొలి సారి ఎన్నికైన భూపేంద్ర పటేల్ కు సీఎం కుర్చీ దక్కింది. బీజేపీ అధిష్ఠానం దూతల సమక్షంలో జరిగిన బీజేఎల్పీలో పటేల్ పేరును రూపానీనే ప్రతిపాదించారు. దీంతో అందరూ పటేల్ అభ్యర్థిత్వానికే ఓటేశారు. ఆ వెంటనే గవర్నర్ ను పటేల్ కలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించడం.. అందుకు గవర్నర్ సమ్మతించడం, ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
పటేల్ కు వరదల స్వాగతం
ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో సోమవారం మధ్యాహ్నం భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హాజరయ్యారు. ఓ వైపు పటేల్ పదవీ ప్రమాణం జరుగుతుండగానే.. గుజరాత్ ను వరదలు ముంచెత్తాయి. గడచిన కొన్ని రోజులుగా గుజరాత్ లో వర్షాలు కురుస్తుండగా.. ఆ ప్రభావంతో సరిగ్గా పటేల్ పదవీ ప్రమాణం చేసిన రోజే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా రాజ్ కోట్ తో పాటు జామ్ నగర్ లను ఈ వరదలు అతాలకుతలం చేశాయి. రాజ్ కోట్ పరిస్థితి ఎలా ఉన్నా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన అత్యంత భారీ పెట్రో కాంప్లెక్స్ ఉన్న జామ్ నగర్ ను వదరలు ముంచెత్తడం నిజంగానే కలకలం రేపే వార్తగానే చెప్పాలి. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న విశ్లేషకులు పటేల్ పదవీ ప్రమాణం శకునం బాగా లేదన్న కోణంలో ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.










