తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజల సమస్యలపైనా, వాటి పరిష్కారంపైనా తనదైన శైలిలో ప్రత్యేక దృష్టా సారిస్తారు. ఏ సమస్యనైనా సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ కు చేరవేస్తే చాలు.. ఆ సమస్య పరిష్కారమైనట్లేనన్న వాదనలూ లేకపోలేదు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే నిమిత్తం స్వయంగా కేటీఆరే ట్విట్టర్ వేదికగా ప్రజలతో మాట్లాడిన సందర్భాలు కూడా తెలిసిందే. ఈ తరహాలో హైదరాబాద్‌లోని సమస్యలు వినిపించిన వెంటనే కేటీఆర్ స్పందించే తీరు జెట్ వేగంతో కూడుకుని ఉంటుంది కూడా. మొత్తంగా ప్రజా సమస్యలపై.. ప్రత్యేకించి హైదారబాదీల సమస్యలపై కేటీఆర్ తనదైన శైలి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనే చెప్పాలి. అలాంటి కేటీఆర్‌కే ఇప్పుడు ఓ చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
వరద ప్రాంతాలను పట్టించుకోలేదా?
ఇటీవలి గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షం కారణంగా నగరాన్ని వరదలు కూడా ముంచేశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుసబెట్టి మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు.. ఒక్కో రోజు నగరంలోని ఒక్కో ప్రాంతాన్ని ముంచేసింది. వెరసి నగరంలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. వీటిలో కొన్ని కాలనీలు వరద నీటి నుంచి తేరుకున్నా.. చాలా ప్రాంతాలు ఇంకా నీటిలోనే మునిగే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీల్లోని ప్రజలను ఇప్పటిదాకా పలకరించిన నాథుడే లేడట. అటు అధికారులే కాకుండా ఇటు రాజకీయ నేతలు కూడా ఈ ప్రాంతాల ప్రజలను పలకరించలేదట. వర్షం తెరిపి ఇచ్చి రెండు రోజులు అవుతున్నా.. తాము ఇంకా నీటిలోనే మునిగి ఉన్నామని, ఇలాగైతే తమ పరిస్థితి ఏమిటని కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టర్లతో పాటు వీడియోలు కూడా
ఈ పరిస్థితిపై కొందరు వినూత్నంగా ఆలోచించి.. సమస్యను నేరుగా కేటీఆర్‌కే తెలిసేలా ఓ ప్లాన్ రచించారట. ఆ ప్లాన్ లో భాగంగా ‘కేటీఆర్ మిస్సింగ్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్లను అంటించేశారు. వరదల్లోనే చిక్కుకుపోయిన ప్రాంతాల్లో కనిపించిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరికొందరేమో.. ఈ పోస్టర్లను, వాటి పక్కనే పారుతున్న వరద నీరు కనిపించేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇటు పోస్టర్లు, అటు వీడియోలతో జనం ఓ ఆట ఆడుకుంటున్నారట. మరి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. వీటిని చూశారో, లేదో తెలియదు. ఒకవేళ వాటిని చూస్తే.. ఆయన ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
Must Read ;- షర్మిల బండారమూ బయటపడిందే