ఎటాక్ కు కౌంటర్ ఎటాక్ లాగా రాంగోపాల్ వర్మ, మంత్రి పేర్ని నానిల ట్విట్టర్ వార్ ఉంది. ఇక్కడ వార్ వన్ సైడ్ కాదు.. ఇద్దరూ ఎవరికి వారు ధీటుగానే స్పందిస్తున్నారు.
బహుశా సినీ పరిశ్రమ తరఫున వర్మలా స్పందించిన వారు ఇప్పుడు లేరు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఇదే స్థాయిలో విరుచుకు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి సున్నితంగా స్పందించారు. ఆ తర్వాత మోహన్ బాబు లేఖాస్త్రాన్ని స్పందించారు. వర్మ మాత్రం ట్విట్టర్ అస్త్రంతో యుద్ధానికి దిగారు. ఆయన ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా బాసటగా నిలిచారు. వర్మ ట్వీట్లకు మంత్రి నాని కూడా ఘాటుగానే స్పందించారు. నాని ప్రశ్నలకు మళ్లీ వర్మ కూడా నానికి బదులిచ్చారు.
‘నాని గారూ..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది ప్రశ్న కాదండీ.. అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం. ఎడారి నీరు దొరకనప్పుడు ఐదు లక్షల రూపాయలకు కూడా కొనవచ్చు. దాన్ని ఎక్స్ప్ యిట్ చేస్తున్నారని అనుకోకూడదు.. మార్కెట్ ఉన్నదే అందుకు. కారు కొనాలనే కోరికను పెంచడానికే లగ్జరీ కార్లు తాయరుచేస్తారు. దాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే మనం కాలినడకనే వెళ్లే వాళ్లం. రూ. 500 తయారయ్యే ఓ కళాకృతిని రూ. 5 కోట్లకు కూడా కొనేవారు ఉంటారు. ముడి పదార్థానికి మాత్రం ఖరీదు కడితే దాని బ్రాండ్ కూ, దాని ఆలోచనకూ వెల ఎలా నిర్ణయిస్తారు’ అంటూ లాజికల్ గా తన వాదనను కొనసాగించారు.
చివరికి ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ వరకూ తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కీ కూడా తేడా లేదా అని ప్రశ్నించారు. పేదల్ని ధనికుల్ని చేయడానికి మీ ప్రభుత్వం పనిచెయ్యాలి కానీ ధనికుల్ని పేదల్ని చేయకూడదు అన్నారు. అలా చేసే ఏపీ పేద రాష్ట్రంగా మిగిలిపోతుందని అన్నారు. తాను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ మాత్రమేనని, ఎకనమిక్స్ గురించి తనకు ఏబీసీడీ కూడా తెలియదని, మీరు అనుమతిస్తే ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనమిక్స్ ఎక్స్ పర్ట్స్ తో చర్చకు సిద్ధమేనని అన్నారు. సినిమా పరిశ్రమకూ, ప్రభుత్వానికీ మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోవాలంటే ఇలాంటి చర్చ అవసరమన్నారు.
కొడాలి నాని ఎవరో తెలియదు
రాంగోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. ఏపీ టికెట్ రేట్ల విషయం లో తాను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని, తనకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ అని ఒక్కడేనని, కొడలి నాని ఎవరో తనకు తెలియదని అన్నారు. మొత్తానికి ఈ ట్విట్టర్ వార్ శ్రుతి మించి రాగాన పడుతోంది. దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా? మరింత పెరిగుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎప్పుడు ఎవరి నుంచి ఎలాంటి ట్వీట్ వస్తుందనని అందరూ ఎదురుచూస్తున్నారు.











