(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తన ప్రెస్ మీట్‌పై ఎవరైనా కౌంటర్ ఇస్తే వారు చేసిన ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తానని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి తన భావాన్ని వ్యక్తం చేయడం తప్పులేదని, కౌంటర్ ఇస్తే వారి ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తానని హెచ్చరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఎదుటవారి భావ స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనూ మూడు రాజధానుల విషయమై ‘పలాసలో తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేసి’ వివాదాస్పద వాతావరణం సృష్టించిన సీదిరి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే చర్చ జిల్లా వ్యాప్తంగా వాడివేడిగా సాగుతోంది.
పలాస వస్తే .. చూపిస్తా : ఎంపీకి సవాల్
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పలాస రావటం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం పరిపాటిగా మారిందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మంత్రి అప్పలరాజు విమర్శించారు. పలాస-కాశీబుగ్గ పురపాలక కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ ‘చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వాస్తవాలు తెలుసుకో లేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో దోపిడీదారులు ఏది కనిపిస్తే దాన్ని ఆక్రమించేశారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఈ సమావేశం పెట్టానని తెలిపారు.
‘ఎవరు దొంగలో, ఎవరి హయాంలో ఆక్రమణలు జరిగియో సాక్ష్యాధారాలతో చూపిస్తా. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. ఇద్దరం కలసి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగిద్దాం. ఎవరైనా తన ప్రెస్‌మీట్‌పై కౌంటర్ ఇస్తే మీరు చేసిన ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తాను.’ అంటూ ఎంపీని ఉద్దేశించి హెచ్చరించారు. ఆనాడు ఉద్దానం ప్రాజెక్టు ఎర్రన్నాయుడు తెచ్చారని మీతో పాటు మేమూ చెప్పుకొంటున్నామని, ఇప్పుడు ఉద్దానం మంచి నీటికి సీఎం రూ.700 కోట్లు ఇస్తే అపహాస్యం చేస్తారా అని విమర్శించారు. మరో మహిళా నాయకురాలి మాటలు తాను పట్టించుకోనని టీడీపీ శ్రీకాకుళం పూర్వ అధ్యక్షురాలు గౌతు శిరీషను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పలాసలో విస్తరణ పనులకు 16న భూమిపూజ చేస్తున్నామని, తెదేపా నేతలను నియోజకవర్గ ప్రజల తరపున ఆహ్వానిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ‘పేద ప్రజలు, ఇళ్లు లేనివారు నా వద్దకు రండి. ఏ ఒక్కరూ ఆక్రమణలకు దిగొద్దు. ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు నాకు సమాచారమిస్తే అడ్డుకట్ట వేస్తాం. నేను చర్యలు తీసుకోకపోతే నాపై నిందలు వేయండి’ అని పేర్కొన్నారు.
సూదికొండ ప్రాంతంలో భూ విక్రయాలు : ఎంపీ
రాష్ట్ర మంత్రి అప్పలరాజు నియోజకవర్గం పలాసలో సూదికొండపై క్వారీ ఏర్పాటుకు ఓ విశ్రాంత అధికారిని తీసుకువచ్చి ఎన్‌వోసీ ఒక్కరోజులో పొందారని, క్వారీ తవ్వుతూ మరోవంక చదును చేస్తూ ఆ భూమిని విక్రయించడానికి యత్నిస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రతిపక్షం పట్టు ఉన్న ప్రాంతాల్లో ఓట్లు గల్లంతు చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించామని తెలిపారు.