అది 1971వ సంవత్సరం. డిసెంబరు 16. భారత్ అంతటా పండుగ వాతావరణం. హిందూ ముస్లిం తేడా లేదు. ఎటు చూసినా ఒకటే సందడి. ఎక్కడ విన్నా ఒకటే నినాదం.. జైభారత్, వందేమాతరం. ఆ రోజును ప్రజలంతా ఓ జాతీయ పండుగలా జరుపుకుంటున్నారు. మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కు అది ఓ కాళరాత్రి. అంతటా నిశ్శబ్దం.. నిశీధి వాతావరణం రాజ్యమేలుతోంది. రెండు పొరుగు దేశాల్లోని ఈ భిన్నవాతావరణ పరిస్థితుల మధ్య భారత్ కు ఓ పొరుగు దేశం కొత్తగా ఆవిర్భవిస్తోంది. అదే.. పాక్ తూర్పు ప్రాంతం నుంచి విడివడిన బంగ్లాదేశ్. బంగ్లా స్వాతంత్ర్య పోరాటానికి భారత్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించి.. పాక్ కబంధ హస్తాల నుంచి వారికి విముక్తి కల్పించిన రోజు అది. 13 రోజుల భీకర పోరాటంలో భారత్.. పాక్ ను మట్టికరిపించిన రోజు ఇది. అందుకే.. ఇది చరిత్రలో విజయదివస్ గా నిలిచిపోయింది.

90 వేల సైనికులు లొంగిపోయారు
1971 డిసెంబరు 3న మొదలైన దాయాదుల సమరంలో భారత్ విజేతగా నిలిచింది. 49 ఏళ్ల క్రితం ఇదే రోజున పాక్.. తన ఓటమిని అంగీకరించింది. అందుకు గుర్తుగా ఆరోజు ఢాకాలోని రామ్‌నా రేస్‌కోర్సులో పాక్ సైన్యాధ్యక్షుడు అమిర్ అబ్దల్లా ఖాన్ నియాజీ.. తన 90 వేల మంది సైనికులతో వచ్చి భారత్ కు లొంగిపోయాడు. భారత నాటి సైన్యాధిపతి జగ్జిత్ సింగ్ అరోరా ముందు నీళ్లు నిండిన కళ్లతో, ఎర్రబడ్డ ముఖంతో తలవంచి.. ఓటమిని అంగీకరించాడు. తన యూనిఫామ్ కు ఉన్న మెడల్స్.. భారత విజయ సారథికి అందించాడు.
సరికొత్త అథ్యాయం మొదలైంది
నాటి ప్రధాని ఇందిర నేతృత్వంలో సాధించిన ఈ అద్భత విజయం.. భారత్ ప్రపంచ దేశాల్లో ఓ నూతన శక్తిగా అవతరించేందుకు తోడ్పడింది. ఇందిరను తిరుగులేని నేతగా నిలిపింది. నాటి యుద్ధాన్ని తల్చుకుంటే ప్రతి భారతీయుడి గుండె నేటికీ గర్వంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే.. ఈ యుద్ధంలో భారత్.. దాదాపు లక్ష మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకుంది. ఆ ముష్కరమూకను లాహోర్ వరకు తరిమి కొట్టింది. ఈ ఓటమి.. పాక్‌కు ఓ పీడకలనే మిగిల్చింది. కొన్నేళ్లపాటు భారత్ పేరెత్తితే ఒణికేలా చేసింది.
https://www.youtube.com/watch?v=bR4bpaxVyzk











