ఒక కథను 2 గంటల్లో సినిమాగా చెప్పాలంటే అది సాహసమే అవుతుంది. అలాంటి కథలు వెబ్ సిరీస్ రూపంలో చెప్పడం చాలా తేలిక అవుతుంది. ఎపిసోడ్ .. ఎపిసోడ్ కి మధ్య కథను బిగిస్తూ పట్టుగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. కథను ఎక్కడికక్కడ భాగాలు చేసుకుని చెప్పుకుంటూ వెళుతూ నెటిజన్లలో ఆసక్తిని పెంచడానికి దోహదపడుతుంది. ఈ కారణంగానే వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతూ పోతోంది. అలా ఆ మధ్య వచ్చిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
‘మీర్జాపూర్’ సెకండ్ సీజన్ కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా మరెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ కథ రెండవ సీజన్ నెటిజన్ల ముందుకు వచ్చేసింది. ‘ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై రితేశ్ సిధ్వాని .. పర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించిన సీజన్ 2 ఇటీవలే ‘అమెజాన్ ప్రైమ్‘ లో ‘స్ట్రీమింగ్’ అయింది. పునీత్ కృష్ణ – వినీత్ కృష్ణ .. కథ – స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సీజన్ 2కి గుర్మీత్ సింగ్ – మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు.

పంకజ్ త్రిపాఠి .. ఇషా తల్వార్ .. ప్రియాన్షు .. శ్వేత త్రిపాఠి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ కథ అంతా కూడా ‘మీర్జాపూర్‘ చుట్టూ తిరుగుతుంది. ‘మీర్జాపూర్’ పై పట్టు సాధించడానికీ .. పెత్తనం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు చేసే ప్రయత్నంగా నడుస్తుంది. మంచి కోసం .. మనుగడ కోసం ఆ శక్తులను ఎదిరించే సమయం కోసం ఎదురుచూసే మరికొంతమందితో సాగుతుంది. కలీన్ అతని కొడుకు మున్నా ఇద్దరూ కూడా ‘మీర్జాపూర్’పై తమ పట్టు సడలకుండా చూసుకుంటూ ఉంటారు. తమ పెత్తనానికి అడ్డులేకుండా ఉండటం కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. వాళ్ల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు .. గాయపడినవారు ఎంతోమంది. ఈ తండ్రీ కొడుకులపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం బాధితులంతా ఎదురుచూస్తుంటారు. మున్నా చేతిలో గాయపడిన గుడ్డూ కోలుకుంటూ ఉంటాడు. అతనికి గోలు .. డింపీ సేవలు చేస్తూ ధైర్యం చెబుతుంటారు. తను పూర్తిగా కోలుకోగానే ‘మీర్జాపూర్’ వెళ్లాలనే పట్టుదలతో గుడ్డూ ఉంటాడు. మీర్జాపూర్ ను చేజిక్కించుకోవడానికి శరత్ రంగంలోకి దిగుతాడు.
మున్నా చేతిలో కొడుకును కోల్పోయిన యూసఫ్ కి ఈ విషయం తెలుస్తుంది. ‘మీర్జా పూర్’ దక్కించుకునే విషయంలో తాను సహకరిస్తాననీ, అయితే అందుకు ప్రతిగా మున్నాను చంపే విషయంలో తనకి హెల్ప్ చేయమని శరత్ ను అడుగుతాడు యూసఫ్. మరో వైపున మున్నాను అప్పగించమంటూ యాదవ్ వైపు నుంచి కలీన్ కి బెదిరింపులు మొదలవుతాయి. చకచకా మారిపోతున్న పరిణామాలను గురించి కలీన్ ఆలోచనలో పడతాడు. కాలం కలిసిరాకపోతే శత్రువులంతా ఏక కాలంలో దాడిచేస్తారనే విషయం అతనికి అర్థమవుతుంది.
వ్యతిరేక శక్తులు పెరుగుతుండటం .. అవన్నీ బలపడుతుండటం కలీన్ గ్రహిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను తీసుకునే నిర్ణయం ఎలాంటి విపరీతాలకు దారితీస్తుంది? ‘మీర్జాపూర్’ విషయంలో గెలిచేదెవరు? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో సీజన్ 2 సాగుతుంది. కథ చిక్కబడటం వలన ఫస్టు సీజన్ కంటే ఎక్కువ ఆదరణ సెకండ్ సీజన్ కి లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
Must Read ;- మీర్జాపూర్ 2 బ్యాన్ చేయాలని ఎం.పీ డిమాండ్











