మన ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ గా నిలిచింది ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ అనేక కాంట్రవర్సీలకు వేదిక అయ్యింది. అసలు కథ ఏమిటంటే.. యూపీలోని ‘మీర్జాపూర్’ అనే ఏరియాలో అఖండానంద్ అనే మాఫియా డాన్ ఉంటాడు. అక్కడ ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అలాంటి వ్యక్తి కుమారుడైన మున్నాకు.. ఓ చెట్టుకింద ప్లీడర్, ఆయన తనయుల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘మీర్జాపూర్’ స్టోరీ.
తొలి సీజన్ హిట్టవడంతో, రెండో సీజన్ తెరకెక్కించాడు దర్శకుడు కరణ్ అన్షుమాన్. రెండో సీజన్ ను కూడా అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేశారు. రిలీజ్ అయ్యి సూపర్ సెన్సేషన్ హిట్ అయిన రెండో సిరీస్ ను కూడా బ్యాన్ చెయ్యాల్సిందే అని ఇంకా నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రజా సంఘాల నాయకులు ఈ వెబ్ సిరిస్ ను బ్యాన్ చేయమని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వెబ్ సిరీసుల వలన ముఖ్యంగా యువత చెడిపోతున్నారని వారు చెబుతున్నారు.
ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయకపోతే తాము రోడ్ల మీదకు వస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న లక్నోలోని మీర్జాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఈ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలని తమ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఒక ఎంపీ కూడా ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మీర్జాపూర్ ప్రాంతాన్ని తప్పుగా చూపించారని ఎంపీ అనుప్రియ ఆరోపిస్తున్నారు. ఈ సిరీస్ ను బ్యాన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఎంపీ హెచ్చరించారు. ఎంపీ డిమాండ్ తో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ యూనిట్, అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి మరి.