కడుపున మోసిన కన్నబిడ్డ పై చెయ్యి ఎత్తలంటేనే ఎంతో విలవిలలాడే తల్లి..కనికరం లేకుండా కన్నబిడ్డను కడతేర్చింది అంటే ఆ బిడ్డ తల్లికి ఎంత కడుపు మంట రగిల్చి ఉంటాడో?. ఏ తల్లి చేయని పనికి పూనుకొని బిడ్డను హతమార్చిన కన్నతల్లి ఎవరు? ఎందుకు హతమార్చింది? అంటే..
విశాఖ జిల్లా మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీలో శ్రీను, మాధవి దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్(18), కుమార్తె ఉన్నారు. గత కొద్ది రోజులుగా కుమారుడు అనిల్ చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో వారితో నిత్యం గొడవలు పడుతున్నాడు.
ఇంట్లో వారితోనే కాకుండా బయట వారితో కూడా గొడవలు పడుతుడండంతో మైనర్ గా ఉన్నప్పుడే పలుసార్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. నిత్యం తల్లిదండ్రులతో గొడవలు, బయటి వారితో గొడవలు పడుతూ ఉండేవాడు.
మద్యం, గంజాయి కోసం డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను నిత్యం వేధించేవాడు. లేకపోతే తల్లిని, చెల్లిని చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా అనిల్ తల్లిదండ్రులతో గొడవ పడి వారి మీద దాడి చేశాడు.
ప్రతి రోజు గొడవలతో విసిగిపోయిన అనిల్ తల్లి మాధవి అనిల్ నిద్ర పోయిన తరువాత ఛాతీ మీద ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ తో మోదింది. దీంతో అనిల్ నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు మాధవిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
మాధవికి మద్దతు తెలిపిన మహిళలు
పోలీసులు నిందితురాలిని అదుపులోనికి తీసుకుంటున్న సమయంలో అక్కడికి చేరుకున్న మహిళలు నిందితురాలు మాధవికి మద్దతుగా నిలిచారు. ఇటువంటి కొడుకును చంపినందుకు మాధవికి అభినందనలు తెలిపారు. ఏ కన్నతల్లి చేయనటువంటి పనిని మాధవి చేసింది అంటే ఆమె అనిల్ వల్ల ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది అని పేర్కొన్నారు.