అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మొదటి సీజన్ కు బాగా థ్రిల్లయి రెండో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సారి కథ ఎటు వెళుతుందో.. అందులోని పాత్రలు ఎలా బిహేవ్ చేయబోతున్నాయి.. అనే ఆత్రుత వాళ్ళలో ఉంది. దానికి తగ్గట్టుగానే ‘మీర్జాపూర్’ రెండో సీజన్ ఈ నెల 23న స్ట్రీమింగ్ కాబోతున్నట్టు.. ప్రచారం మొదలైంది.
పంకజ్ త్రిపాఠీ, దివ్యేందు శర్మ, ఆలీ ఫజల్, శ్వేతా త్రిపాఠీ నటిస్తోన్న మిర్జాపూర్ సిరీస్ ను గుర్మీత్ సింగ్, మిహీర్ దేశాయ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇందులోని థ్రిల్లింగ్ కథాంశమే ఎక్కువగా అందరినీ ఆకర్షించింది. ఇదే కథాంశం రెండో భాగంలో మరిన్ని ట్విస్టులతో .. మరింతగా జనాన్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.
ముఖ్యంగా మొదటి సీజన్ లో తన నటనతో పడగొట్టేసిన నటుడు పంకజ్ త్రిపాఠీ. ఖాలిన్ భయ్యాగా అదరగొట్టిన అతడు.. రెండో సీజన్ లో కూడా మరిన్ని సర్ ప్రైజులు ఇస్తాడట. మొదటి సీజన్ లాగానే .. రెండో సీజన్ కూడా తెలుగులో రాబోతోంది. అన్నిభాషలతో పాటు గా తెలుగులోనూ మీర్జాపూర్ మొదటి భాగం సూపర్ హిట్టైంది. అందుకే రెండో సీజన్ ను కూడా తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘మీర్జాపూర్ 2’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది . మరి రెండో సీజన్ లో ‘మీర్జాపూర్’ ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.