ఆన్‌లైన్‌లో అప్పులు నిమిషాల్లో మంజూరవతుండడంతో అందరూ వాటిపై మొగ్గుచూపుతున్నారు. కానీ దాని పరిణామాలు తర్వాత తీవ్రంగా ఉంటాయని వారు గ్రహించలేకపోతున్నారు. అత్యవసరం కావడం వల్లో మరేదైనా కారణం వల్లో ఆన్‌లైన్‌లో నిమిషాల్లో అప్పు మంజూరు అవుతుంది కదా అని అప్పటి అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమాత్రం ఆలస్యమైనా వారి వేధింపులు భరించలేకపోతున్నారు. అలా భరించలేకే సిద్ధిపేట నుంగనూరు మండలం రాజగోపాలపేటకు చెందిన ఓ 24 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి కోసం అప్పు
రాజగోపాలపేటకు చెందిన కిర్ని మౌనిక ఖాతా క్లస్టర్‌లో ఏఈఓ అధికారిణిగా పనిచేస్తుంది. ఆమె తండ్రికి వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో ఆయన కోసం ఆన్ లైన్ యాప్ ‘స్నాప్ ఇట్ లోన్’ ద్వారా రెండు నెలల క్రితం 3 లక్షలు అప్పు చేసింది. అప్పు కట్టాల్సిన సయమం దాటిపోవడంతో ఆ యాప్ వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్ కాంటాక్ట్ లోని నంబర్లను సేకరించిన సంస్థ, మౌనిక రుణం తీసుకుని కట్టలేదని, అప్పు ఎగవేసిందంటూ వారందరికీ మెసెజ్ పెట్టారు. వారు తనని అడగడంతో అవమానంగా భావించిన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ, ఎంత ప్రయత్నించినా కూడా ఆమె ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మౌనిక ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
Must Read ;- అప్పుచేసి అభివృద్ధి పనులు.. చివరకు యువ సర్పంచి ఆత్మహత్య











