రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తేదీలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రధానంగా కరోనానే కారణం అని చెప్పాలి. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు అనే సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఆచార్య’ సినిమాలోనూ రామ్ చరణ్ హీరోగా నటించాడు. కరోనా థర్డ్ వేవ్ లేకుండా ఉంటే జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీ, ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ మూవీ విడుదలై ఉండేవి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒక్కసారిగా తేదీలు మారిపోయాయి.
మార్చి 25న రానున్నట్లు ఇంతకుముందు ఆచార్య నిర్మాతలు ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆచార్య విడుదల కావలసిన తేదీలో ట్రిపుల్ ఆర్ విడుదల కాబోతోంది. ట్రిపుల్ఆర్ విడుదలవుతుందని ప్రకటించిన ఏప్రిల్ 28న కాకుండా ఒక్క రోజు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 29న ఆచార్య విడుదలవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
‘ఆచార్య’ మూవీ ఇలా వెనక్కి జరగడానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ తేదీల మార్పు వెనక లెక్క ఏమై ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల విషయంలో మరో తేదీ కూడా ఉంది. అది మార్చి 18. ఏప్రిల్ సినిమాని ఆపడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున మార్చిలో విడుదలకే నిర్మాతలు ప్రాధాన్యం ఇచ్చారు.
దాంతో రెండు చిత్రాల నిర్మాతలూ కూర్చుని ఒక ఒప్పందం మేరకే విడుదల తేదీలను ప్రకటించినట్టు సమాచారం. కొత్త పరిణామాల ప్రకారం ఫిబ్రవరి 25న విడుదల కావలసిన పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ విడుదల ఏప్రిల్ 1కి వాయిదా పడింది. పవర్ స్టార్ అభిమానులకు నిరుత్సాహం కలిగించే వార్త ఇది. విడుదల కావలసిన మరికొన్ని సినిమాల తేదీల విషయంలో నెలకొన్న గందరగోళానికి రెండుమూడు రోజుల్లో తెరపడనుంది.











