ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఐదేళ్లపాటు నీలం సాహ్ని బాధ్యతలు నిర్వహించనున్నారు. తనపైన ఉన్న నమ్మకంతో గవర్నర్ ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు, కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇవాళే కసరత్తు
నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌తో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 17లోగానే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని నీలం సాహ్ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించి, 10న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటు నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే.
Also Read:నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని