ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. ఈ ఎన్నికల పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. గత ఏడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులకు దిగి ఏకగ్రీవాలు చేసుకున్నారంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి, తాజాగా ప్రక్రియ ప్రారంభించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. పంచాయతీ ఎన్నికల తరవాత అన్ని స్థానిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది. అయితే ఎస్ఈసీ కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు పూర్తి చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల తరవాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని అందరూ భావించారు. కానీ కోర్టులో కేసు తుది తీర్పు రాకపోవడంతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు.
16 నుంచి ఎస్‌ఈసీ విదేశీ పర్యటన
మార్చి నెలాఖరుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విమరణ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి విదేశీ పర్యటనకు వెళతారని తెలుస్తోంది. ఈ లోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కోర్టు తీర్పు వెలువడినా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించే సమయం నిమ్మగడ్డకు లేదని తెలుస్తోంది. ఇక కొత్త ఎస్‌ఈసీ వచ్చినాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రభుత్వం సిద్ధంగా ఉందా..
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించినా పెద్దగా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదనే భావనలో వైసీపీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జడ్పీ ఎన్నికల గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం లేదు. కోర్టు తీర్పును పరిశీలించి, కొత్త ఎస్‌ఈసీ నియామకం జరిగిన తరవాత, జడ్పీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- అనుకున్నదొకటి, అవుతోందొకటి.. కాగితం పులిగా నిమ్మగడ్డ











