నిమ్మగడ్డ ప్రకటన చేసిన క్షణం మొదలుకుని ప్రభుత్వం కమిషనర్ పై విరుచుకుపడుతుంది. అంతలా ఎన్నికల కమిషనర్ ను నిందించాల్సిన పనేముంది. అసలు ప్రభుత్వం మదిలో ఆలోచన ఏంటనేది బేతాళ ప్రశ్న. కరోనా మహమ్మారి వల్ల దేశమంతా అల్లాడుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుపట్టింది జగన్ సర్కార్. అంతేనా పారాసెటమాల్, బ్లీచింగ్, కరోనాతో సహజీవనం అంటూ నేషనల్ మీడియా సాక్షిగా రాష్ర్ట పరువు తీశారు. కరోనా మెల్లగా తగ్గుతూ… తిరిగి జనజీవనం అంతా మామూలుగా జరుగుతున్న ఇలాంటి సమయంలో కరోనా భూతం అంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది.
కరోనా సాకు మాత్రమే…
ప్రభుత్వ తీరును గమనిస్తే… పైకి కరోనాను సాకుగా చూపి.. తాము కోరుకున్నప్పుడు ఎన్నికలు నిర్వహించలేదనే ఇలా పంతానికి పోతున్నట్లు అనిపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. మార్చిలో, రాష్ర్టం లోనే కాకుండా.. దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కానీ, అటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుపట్టడాన్ని అప్పట్లో కోర్టు కూడా తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుందని మద్దతుగా నిలిచింది. ఇప్పుడు దేశంలోనే కాదు… ప్రపంచమంతా జన జీవనం తిరిగి మామూలు స్థితికి వస్తున్న ఈ సమయంలో కరోనా కారణమనేది సాకు మాత్రమే అని విస్పష్టంగా తెలుస్తుంది. తమ మాటను లెక్కచేయకుండా వాయిదా వేశారు కనక, నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించనీకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్ధేశంగా కనిపిస్తుంది.
Must Read:-నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్
నిర్వహించలేం.
ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ప్రభుత్వం వ్యతిరేక చర్యలకు సమాయత్తం అయింది. రాష్ర్ట సిఎస్ నీలం సాహ్ని రంగంలోకి దిగారు. ఎన్నికల కమిషనర్ కు వెను వెంటనే ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని లేఖలో పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేసిందని గుర్తుచేశారు. అందునా చలికాలం కావడం కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పొరుగు రాష్ట్రాల పరిస్థితులతో మన రాష్ట్ర పరిస్థితులను పోల్చడం సరికాదంటూ హితోపదేశం చేయడానికి ప్రయత్నించారు నీలం సాహ్ని. అక్కడితో ఆగకుండా… రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నప్పుడు మేమే మీకు తెలియజేస్తామని కాస్త ఘాటుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ప్రశ్నిస్తున్నారా?
నీలం సాహ్ని లేఖకు అంతే ఘాటుగా స్పందించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిఎస్ లేఖకు ఎస్ఎంఎస్ ద్వారా బదులులిచ్చారు నిమ్మగడ్డ. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని మీరు ప్రశ్నిస్తున్నారా? మీరు రాజ్యంగ వ్యవస్థను కించపరుస్తున్నారు. ఇలా ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని అడ్డుకోవడం రాజ్యంగ విరుద్ధం అని మరవకండి అంటూ చాలా ఘాటు సమాధానాన్ని ఇచ్చారు నిమ్మగడ్డ.
రివర్స్ గేర్!
ఇలా మాటలు, లేఖల అస్త్రాలను చూస్తుంటే, రాష్ట్ర రాజకీయాలు యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి కమిషనర్ ఈరోజు గవర్నర్ ని కలిసి పరిస్థితిని వివరించనున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయించారు ఎన్నికల కమిషనర్. దేశంలో ఇంకా కరోనా ఉన్న మాట నిజమే… కాని అన్ని రాష్ట్రాలు దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు పాటిస్తూ… ముందుకు సాగుతున్నాయి. అందుకు నిదర్శనమే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు. తాజాగా విడుదలైన తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్. కనీసం వారిని చూసైనా నేర్చుకోండి అని అంటుంటే వారితో మమ్మల్ని పోల్చకండి అంటూ రివర్స్ లో మాట్లాడుతుంది ప్రభుత్వం. ప్రాజెక్ట్ లో రివర్స్ టెండర్ చేసినట్టు… కరోనా విషయంలో అందుకు ముందుకు వెళ్తున్న సమయంలో జగన్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో ఉన్నట్లుంది.
Also Read:-ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?











