మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ చీఫ్ సెక్రటరీకి గురువారం ఒక లేఖ రాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ముసుగులో భూముల కొనుగోళ్లు, వాటిని లెవెలింగ్ చేయడం వంటి పనుల్లో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. వందల కోట్ల రూపాయల నిధులను వైసీపీ నాయకులు స్వాహా చేశారని పేర్కొన్నారు.
రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుమారు 600 ఎకరాల ఆవ భూముల్ని ఒక్కో ఎకరం 45 లక్షల వంతున కొనడాన్ని కూడా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవన్నీ గోదావరికి నీళ్లు రాగానే మునిగిపోయాయని.. ఇలాంటి ముంపు భూములకోసం పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే ముసుగులో సుమారు 270 కోట్ల ప్రజాధనం దోచుకున్నారని అన్నారు. అదనంగా మరో 250 కోట్ల రూపాయలను ఈ ముంపు భూముల లెవెలింగ్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఒక ఆదాయమార్గం మార్చుకున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు. ఇలాంటి ఆవ భూములు పేదలకు ఇవ్వడం వల్ల వారి జీవితాలకు భద్రత ఉండదని, అలాగే పర్యావరణం పరంగా కూడా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎస్ దృష్టికి తెచ్చారు.
భూముల యజమానులను వైసీపీ నాయకులు ముందుగానే సంప్రదించి.. భూములను అధిక ధరలకు అమ్మేలా ఒప్పించారని.. ఆ అధిక మొత్తాలను ఆ తర్వాత వారే పుచ్చుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాటి అక్రమాలు తెనాలి, వినుకొండ, కావలి, పాలకొల్లు, పెందుర్తి, చోడవరం, అద్దంకి, పెనమలూరు లాంటి అనేకచోట్ల ఇదే తరహా అక్రమాలు జరిగాయన్నారు.
ఈ మొత్తం భూకుంభకోణంలోకి లోతుగా దర్యాప్తు జరిపించాలని, పేదలకు ఇంటి స్థలాల ముసుగులో జరుగుతున్న అక్రమాల్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలకోసం ఆవభూముల్ని కొనుగోలు చేసిన వ్యవహారంపై చాలా కాలంగా రాద్ధాంతం జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళనలను పట్టించుకోలేదు.
చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీ కి రాసిన లేఖ పూర్తి పాఠం ::