(గుంటూరు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
గుంటూరు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు వింత సమస్య ఎదురైంది. కొత్తగా 15 లక్షల 35 వేల రేషన్ కార్డులు సిద్దం చేసి పంపిణీ చేశారు. అయితే 59 వేల కార్డులు మిగిలిపోయాయి. లబ్దిదారులు ఇచ్చిన చిరునామాల్లో ఎంత వెతికినా వారు కనిపించడం లేదు. వారిచ్చిన ఫోన్ నెంబరుకు కాల్ చేసినా ప్రయోజనం దక్కలేదు. దీంతో కొత్తగా తయారు చేసిన 59 వేల కార్డులు ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ నవశకం సర్వేలో వచ్చిన డేటా ఆధారంగా రేషన్ కార్డులను ముద్రించారు. వాలంటీర్లు సర్వేలో తప్పుడు సమాచారం నమోదు చేయడం, పాత రేషన్ కార్డుల సమాచారాన్ని కంప్యూటరీకరించడం వల్లే తప్పులు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. ఒక్క జిల్లాలోనే 59 వేల కార్డులు తప్పుగా నమోదు చేశారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 7 లక్షలు దాటిపోవచ్చనేది ఒక అంచానా.
తప్పుడు సర్వేలు…
పాత రేషన్ కార్డులను దగ్గర పెట్టుకుని వాటి డేటా మొత్తం కంప్యూటరీకరించడం వల్లే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. దీని వల్ల వలస వెళ్లిన కుటుంబాలకు కూడా కొత్త కార్డులు ముద్రించారు. వారంతా ఎక్కడో కూలీ పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉండి ఉండవచ్చు. వారు.. వారి గ్రామాలకు వచ్చి రేషన్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా ప్రాంతాల్లో కూడా వారు రేషన్ కార్డు పొంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది వాలంటీర్లు నిర్వహించిన సర్వే కారణంగా తప్పులు తలెత్తాయని అంచనాకు వచ్చారు. మిగిలిపోయిన 59 వేల కార్డులను పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ కు పంపాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.
రేషన్ భారీగా పక్కదారి
గత కొన్నాళ్లుగా 59 వేల కార్డుల లబ్దిదారుల రేషన్ ఏమైంది. కొత్త కార్డులు ముద్రించగానే వారంతా ఎటుపోయారు. పాత కార్డుల్లో రేషన్ పొందారా లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. లేదంటే డీలర్లు చేతి వాటం ప్రదర్శించి బియ్యం పక్కదారి పట్టించారనే కొణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. బయోమెట్రిక్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. చాలా గ్రామాల్లో ఇంటర్ నెట్ సమస్యలు వేధించాయి. ఆ సమయంలో బయోమెట్రిక్ పడని వారికి కూడా ప్రభుత్వం రేషన్ సరఫరా చేసింది. దాన్ని అదనుగా తీసుకుని రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున బియ్యం పక్కదారి పట్టించి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి.
డిసెంబరు తరవాత పాత కార్డులు చెల్లవు
కొత్త కార్డుల పంపిణీ పూర్తి అయిపోయింది. త్వరలో పాత కార్డుల ద్వారా రేషన్ పంపిణీ నిలిపి వేయనున్నారు. ఆ తరవాత ఎవరైనా పాత కార్డు తీసుకువస్తే రేషన్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెపుతున్నారు. ఇప్పటికీ కొత్త కార్డులు తీసుకోనివారు ఎవరైనా ఉంటే కొత్తవి తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
లింకు తెంపండి సార్
బియ్యం కార్డుతో అనేక ప్రభుత్వ పథకాలను లింకు చేస్తున్నారు. అందుకే చాలా మంది లబ్దిదారులు బియ్యం కోసం కాకుండా ప్రభుత్వం అందించే ప్రయోజనాల కోసమే బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ తరవాత బియ్యం తీసుకోకుంటే కార్డు రద్దు చేస్తారని రేషన్ తీసుకుని చిరు వ్యాపారులకు అయిన కాడికి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు బియ్యం కార్డును ప్రామాణికంగా తీసుకోవడం ఆపివేస్తే లక్షలాది మంది బియ్యం కార్డులు తీసుకోరు. అలా ప్రభుత్వానికి కూడా ఏటా కోట్లాది రూపాయల వృధా తగ్గుతుందడంలో ఎలాంటి సందేహ లేదు.











