‘ప్రేమికుడు’ సినిమాలో ఊర్వశి టేకిట్ ఈజీ పాలసీ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఈజీగా తీసుకోవాలనేది ఆ పాట రచయిత ఉద్దేశం. ఆ పాటకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ప్రబావితమైనట్లు అర్ధమవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇచ్చిన లక్ష్యాన్ని టేకిట్ ఈజీగా తీసుకున్న చెన్నై జట్టు గెలవవలసిన మ్యాచ్ లో ఓటమి చెందింది. కోల్‌కతా విజయంలో క్రెడిట్ మొత్తం చెన్నై జట్టుకు ఇవ్వవలసిందే.
సత్తా చాటిన చెన్నై బౌలర్లు
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ను చెన్నై బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. వరుస విరామాలలో వికెట్లు తీయడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. రాహుల్ త్రిపాఠి మినహ ఎవరూ రాణించలేకపోయారు. త్రిపాఠి 31 బంతుల్లో 50 రన్స్ సాధించాడు. ఆ తరువాత కూడా దూకుడుగా ఆడిన త్రిపాఠి 81 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుభమాన్ గిల్, నితీష్ రానా, మోర్గాన్, రస్సెల్, దినేష్ కార్తీక్ లు దారుణంగా విఫలమయ్యారు. చివరలో కమ్మిన్స్ 17 పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్ 167 పరుగులు చేయగలిగింది.
ఉదాసీనతే కొంపముంచింది
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు వాట్సన్, డుప్లిసిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 3.4 ఓవర్లలలోనే ఈ జోడి 30 పరుగులు జోడించారు. ఈ దశలో డుప్లిసిస్ (17)ని శివమ్ మావి పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రాయుడుతో కలిసి జట్టును విజయం వైపు నడిపించారు. వాట్సన్ వేగంగా ఆడగా రాయుడు చక్కని సహకారం అందించాడు. జట్టు 99 పరుగుల వద్ద రాయుడు(30) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో 2 పరుగుల తరువాత వాట్సన్(50) కూడా వెనుదిరిగాడు. కానీ సాధించవలసిన రన్ రేట్ తక్కువ ఉండటంతో చెన్నై విజయంపై అందరూ ధీమాగా ఉన్నారు.
కోల్‌కతా ఆటగాడు మోర్గాన్ ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ కు ఇచ్చిన సలహా మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ట్రంప్ కార్డు బౌలర్లు సునీల్ నరైన్, రస్సెల్ ను ఫస్ట్ హాఫ్ లో బౌలింగ్ చేయించకుండా తరువాత వేయించమని చెప్పిన మోర్గాన్ సలహాని కార్తీక్ పాటించాడు. దీంతో శివమ్ మావి, నాగర్ కోటి, కమ్మిన్స్ ఓవర్లు ముందుగా ఫినిష్ చేశారు. పిచ్ నెమ్మదించడంతో సునీల్ నరైన్, విజయ్ చక్రవర్తిలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇదే సమయంలో రస్సెల్ కూడా సూపర్ స్పెల్ వేయడంతో చెన్నై పరుగులు చేయలేక ఇబ్బంది పడింది. ధోని, శామ్ కరణ్, జాదవ్ లు విఫలం కావడంతో చెన్నై లక్ష్యానికి చేరుకోలేకపోయింది. దీంతో ఈజీగా గెలవవలసిన మ్యాచ్ లో చెన్నై 10 పరుగుల తేడాతో పరాజయం పాలయింది.
ఊహించని ఓటమితో చెన్నై అభిమానులు షాక్ తిన్నారు. ఈ పరాజయంతో చెన్నై పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడిన చెన్నై కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి నాలుగు ఓటములు మూటగట్టుకుంది.