ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలవుతోంది. అయినా నేటికీ విద్యార్థుల హాజరు శాతం మాత్రం 40 శాతం మించడం లేదు. ఒక వైపు కరోనా భయం, మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి ఉన్నతపాఠశాలలకు వచ్చే విద్యార్థులు రవాణా ఖర్చులు భరించలేక బడులు మానేస్తున్నారు. కరోనా పుణ్యమా అని ఆటో ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. ఆటోవాలాలు కిలోమీటరుకు ఒక్కో విద్యార్థికి పది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి బడికి ఆటోలో వచ్చివెళ్లాలంటే రోజుకు ఒక్కో విద్యార్థి రూ.60 దాకా ఖర్చు చేయాల్సి ఉంటోంది. దీంతో చాలా మంది ఖర్చులు భరించలేక బడులకు హాజరుకావడం మానేస్తున్నారు.
బడులు తెరిచారు బాగానే ఉంది.. కానీ
ఒక్కో మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మూడు నుంచి నాలుగు దాకా ఉన్నాయి. ఏపీలో ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉన్నా, ఉన్నత పాఠశాలలు మాత్రం ప్రతి నాలుగు గ్రామాలకు ఒకటి మాత్రమే నడుస్తోంది. ఉన్నత పాఠశాల స్వగ్రామంలో ఉన్న విద్యార్థులకు పెద్దగా సమస్యలేకపోయినా పొరుగు గ్రామాల విద్యార్ధులు మాత్రం బస్సులు లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటో వాలాలు ఒక్కో సారి 12 మందిని కుక్కుతున్నారు. దీంతో కరోనా కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీనికి తోడు రవాణా ఛార్జీలు కూడా భారంగా మారడంతో ఇక బడుల్లో హాజరు 40 శాతం మించడం లేదు. ప్రభుత్వం బడులు తెరిచినా ప్రయోజనం దక్కడం లేదు.
Must Read ;- ‘ఇంత ఫైన్ కట్టలేను ఇక్కడే ఉరేసుకుంటా?’
ప్రజాప్రయోజనాలు పట్టవా..
నష్టాలు వస్తున్నాయనే ఉద్దేశంతో రద్దీ తక్కువగా ఉంటే మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. కేవలం పట్టణాల మధ్య బస్సులు తిప్పడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గ్రామీణులు కేవలం ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వం విద్యార్థులకు రూ.60 కే బస్సు పాసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.
బస్సులు తిప్పండి సామీ..
ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని కనీసం రెండు ట్రిప్పులు బస్సులు నడపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బస్సులు తిప్పకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలు తెరిచి ప్రయోజనం ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సులు గ్రామీణ ప్రాంతాలకు నడపాలని కోరుతున్నారు.
Also Read ;- అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడేందుకు మీకు?











