ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నగదు బదిలీ సంక్షేమంతో రికార్డులు సృష్టిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే లక్షా 20 వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల పేరుతో జనం ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తంలో దాదాపు 80 శాతం డబ్బు అప్పుగా తీసుకు వచ్చిందే. అయితే ఏపీ ప్రభుత్వం ఇక కొత్తగా అప్పులు తీసుకునే అర్హత కోల్పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పులను ఆరు నెలల్లోనే చేశారు. ఇక అప్పుపుట్టే అవకాశం లేదు. మరి నవరత్నాల సంక్షేమం కొనసాగించడం ఎలాగో అర్థంకాక అవకాశం ఉన్న ప్రతిచోటా పిండటం మొదలు పెట్టారు.
మధ్య తరగతిలో అసహనం…
ఏ ప్రభుత్వానికి అయినా మధ్యతరగతి ప్రజల నుంచి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. వారి కొనుగోలు శక్తిపై ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం ఆదారపడి ఉంటుంది. కరోనా పుణ్యమా అని చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొంత మంది సగం జీతాలకు పని చేస్తున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అంతే సంగతులు. ఇక ప్రభుత్వ ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది. ఇక ప్రజల నుంచి నేరుగా పిండుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే ఈ మధ్య కాలంలో ఒక్క రూపాయి వచ్చే అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. రవాణా శాఖ పెంచిన అపరాధ రుసుములు కూడా ఈ కోవలోకే వస్తాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి 16 నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా తక్షణం వాహనదారుల నుంచి రూ.600 కోట్లు వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు టార్గెట్ పెట్టారట.
ఇక చేసేది లేక వారు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఓవర్ లోడ్ రూ.40 వేల అపరాధ రుసుం పేరుతో లారీ యాజమాన్యాలను బెంబేలెత్తిస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇంత ఫైన్ కట్టలేను ఇక్కడే ఉరేసుకుంటా?
ఏపీ రవాణా శాఖ అమల్లోకి తెచ్చిన నిబంధనలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏ మాత్రం రవాణా శాఖ అధికారులకు దొరికినా కనీసంగా రూ.5 వేల నుంచి రూ.40 వేల ఫైన్ కట్టాలని బిల్లు ప్రింట్ తీసి చేతిలో పెడుతున్నారు. ఇలాంటి ఘటనే విజయవాడ నడిబొడ్డున ఒకటి జరిగింది. బెజవాడ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వద్ద ఓ లారీని అధికారులు ఆపారు. లోడ్ చెక్ చేశారు. తాజా నిబంధనల ప్రకారం రూ.39,800ల అపరాధ రుసుం బిల్లుతీసి ఇచ్చారు. దీంతో డ్రైవర్ కమ్ ఓనర్ అయిన సదరు వ్యక్తికి మైండ్ బ్లాంక్ అయింది.
ఇంత మొత్తం కట్టలేను సార్ అని వేడుకున్నాడట. అయినా కనికరించలేదు. ఇక్కడే లారీకి ఉరేసుకుంటానంటూ ఆ వ్యక్తి తాడు తీసి వాహనానికి కట్టి ఉరేసుకోవడానికి సన్నద్దం అయ్యారని సమాచారం. వెంటనే పోలీసులు, రవాణా శాఖ అధికారులు అతన్ని వారించారట. ఇది నీ ఒక్కడికే కాదు. కాసేపు చూడు ఎంత మందికి భారీగా అపరాధ రుసుములు వేస్తామో అని కాసేపు అతన్ని వారించి, అటుగా వచ్చే వాహనాలకు ఫైన్ వేయడం ప్రారంభించారట.
అన్నీ ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం…
పిల్లల ఫీజు నేనే కడతా. జబ్బు చేస్తే వెయ్యి దాటితే నేనే చూసుకుంటా, ఇక 45 సంవత్సరాలు దాటితే నెలకు రూ.2250 పింఛను ఇస్తా, 45 నుంచి 60 సంవత్సరాల వయసుండే మహిళలకు ఏటా రూ.18000 ఇస్తా. వీటికితోడు ఉచిత విద్యుత్, ఉచిత రేషన్. దళితులకు 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు కట్టేపనిలేకుండా చేస్తా, డ్వాక్రా మహిళలకు ఏటా రూ.10000 సాయం చేస్తా. ఆటో అన్నలకు, బార్బర్లకు, చిరు వ్యాపారులకు ఏటా రూ.10,000 ఇస్తా, ఇక చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరం రూ.24,000 సాయం చేస్తా, లాయర్లు ఇంట్లో కూర్చున్నా కూడా నెలకు రూ.5000 ఇస్తా.. ఇవన్నీ జగనన్న ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలు. వీటికి రకరకాల పేర్లు పెట్టి ఇప్పటికే ఒక దఫా నగదు బదిలీ చేశారు. ఇప్పుడు రెండో ఏడాది నగదు బదిలీకి సొమ్ములు లేవు. ఎక్కడ నుంచి వస్తాయి. అప్పులు పుట్టడం లేదు. మాట ఇచ్చాం. మడమతిప్పం అని కూడా చెప్పాం. ఏం చేయాలి. మనం ప్రజలకు ఇస్తున్నాం. వారు మనకు ఇవ్వరా? అంటున్నారట.. ఏపీ సీఎం. అందుకే బాదుడు ప్రారంభించారు.
బాదుడు మొదలైంది
ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రజలను ఎడాపెడా పిండటం ప్రారంభించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. విద్యుత్ శ్లాబులు మార్చి కళ్లుతిరిగేలా ఛార్జీలు పెంచారు. ఇసుకను బంగారంలా మార్చారు. ఇక రోడ్లపై వాహనాలతో తిరగాలంటే గుండెల్లో దడ పెరిగేలా అపరాధ రుసుములు పెంచారు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇక పిచ్చి పిచ్చి బ్రాండ్లు తెచ్చి లిక్కర్ రేట్లు 250 శాతం పెంచి మద్యపాన పాక్షిక నిషేధం అమల్లోకి తీసుకువచ్చారు.
చివరకు రోడ్డు పక్క కర్రీపాయింట్, పండ్ల బండి, చాట్ బండి, కూరగాయల బండి ఏది పెట్టుకున్నా ఏటా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. నవరత్నాలు అమలు చేస్తానని హామీ ఇచ్చాకానీ వాటికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఎవరూ అడగలేదుగా.. అనేక సంక్షేమ పథకాల ద్వారా మేం ఇస్తున్నాం.. మీరు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలనే సిద్దాంతాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ కథనంలో ఎలాంటి అతిశయోక్తి కానీ, అసత్యంకానీ లేదు. ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం అమలు చేసిన వాటిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది.










