ఏసీ బస్సులు తిప్పితే తీవ్ర నష్టాలు తప్పవని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో ఏసీ బస్సులు నిలిపివేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు.
కరోనా దెబ్బకు జనం వణికిపోతున్నారు
ఏసీ గదుల్లో, ఏసీ బస్సుల్లో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే జనం ఏసీ బస్సులు ఎక్కడం మానేశారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి ఒకప్పుడు కల్పవృక్షంగా ఉన్న ఏసీ బస్సులు, నేడు గుదిబండలా మారాయి. కోట్లాది రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన వోల్వో, స్కానియా బస్సులు ఏసీతో నడుస్తున్నాయి. వాటికి ఏసీ తొలగించడం కూడా సాధ్యం కాదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఏసీ బస్సులు నిలిపివేసే విషయంపై అధికారులు సమాలోచనలు జరిపారు. రవాణాశాఖా మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మార్చి వరకు ఏసీ బస్సులు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బస్సుల్లో సగం మంది కూడా ఎక్కడం లేదు. ఏసీ బస్సులకు డీజిల్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆర్టీసి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో ప్రజా రవాణాకు దూరం
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఆరు నెలలపాటు ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో పేదలు కూడా అప్పుచేసి పాత బైకులు కొనుగోలు చేసుకున్నారు. ఇక ఆర్టీసీ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. బైకులపై ఇద్దరు ప్రయాణం చేస్తే ఆర్టీసీ ఛార్జీలకన్నా తక్కువే ఖర్చు వస్తోందని జనం సొంత వాహనాలు తీస్తున్నారు. దీనికితోడు సొంత వాహనంలో వెళితే సమయం కూడా ఆదా అవుతుంది. ఇంటి వద్ద నుంచి అనుకున్న చోటికి వెళ్లవచ్చు.ఇన్ని సౌకర్యాలు ఉండటంతో ప్రజలు బస్సులు ఎక్కడం మానేశారు. బెజవాడలో సిటీ బస్సులు సగం ఖాళీగా తిప్పాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్ దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కుదేలైందనడానికి ఇదే ఉదాహరణ. ఇక ఏపీఎస్ ఆర్టీసీలో 5 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లను ఇంటికి పంపించివేశారు. వారిని ఇక పిలిచే అవకాశం కూడా కనిపించడం లేదు.
గ్రామాలకు బస్సులు నిలిపివేశారు
ఏపీలో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తిప్పడం లేదు. నష్టాల వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ముందుకు రావడం లేదు. ఏపీలో ఏదైనా పల్లెలకు వెళ్లాలంటే ఆటోలే దిక్కు. పట్టణాల మధ్య మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఆ పట్టణాల మధ్యలో గ్రామాలకు మాత్రమే ప్రజారవాణా అందుతోంది. ఇక మెయిన్ రోడ్డుకు మూడు కిలోమీటర్లు లోపలకు ఉన్నా ఆ గ్రామాలకు బస్సులు తిప్పడం లేదు. ఇక భవిష్యత్తులో కూడా ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తిప్పే ప్రయత్నం చేయడం లేదు. నష్టాల పేరుతో చిన్నగా ఆర్టీసీని కుదించుకుంటూ వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- బాలయ్య, ఈటెల మాటలు అలా.. కరోనా వ్యాక్సిన్ ఇంకెలా?











