(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య ఎగతెగని చర్చలు సాగాయి. కాని చర్చలు సఫలం కాలేదు. బయటకు చెబుతున్న కారణం ఏమిటంటే.. తెలంగాణ ఆర్టీసీ అధికారులు లక్షా 60 వేల కిలోమీటర్లు మాత్రమే ఏపీలో తిప్పగలం అని తేల్చేశారు. ఏపీఎస్ఆర్టీసీ వారు 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పాలని పట్టుబడుతోంది. ఏమిటీ కిలోమీటర్ల లొల్లి.. రెండు నెలల నుంచి ఎడతెగని చర్చలు సాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్టాల అధికారులు నాలుగు సార్లు సమావేశం అయినా చర్చలు కొలిక్కిరాలేదు. చివరకు దసరాకు కూడా ఆర్టీసీ బస్సులు లేక సామాన్యులు హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1200 ఖర్చు చేసి ప్రయివేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది.
చర్చల విఫలం వెనుక ఎవరున్నారు?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నిలిచిపోవడం, నాలుగు దఫాలుగా చర్చలు జరిపినా ముందడుగు పడకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ప్రముఖుల బంధువుల ప్రయివేటు బస్సులు ఆయా రూట్లలో తిరుగుతూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే దసరా వచ్చినా ఆర్టీసీ చర్చలు ఫలించలేదట. ప్రయివేటుకు ప్రజా రవాణా వ్యాపారాన్ని కట్టబెట్టేందుకే చర్చల పేరుతో సాగదీస్తున్నారని, ఆర్టీసీ మీద ప్రజలకు విరక్తిపుట్టేలా చేస్తున్నారని సమాచారం. ఇక ఇప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ బస్సులు తిరుగుతాయన్న నమ్మకం కూడా సడలిపోతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
రూట్లు వేలం వేసేందుకు ప్లాన్ వేశారా?
రూట్లను వేలం వేసేందుకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు సిద్దంగా ఉన్నాయని తెలుస్తోంది. చర్చల విఫలం అయ్యాయనే సాకుతో రూట్ల వారీగా ప్రయివేటుకు అంటే అయిన వారికి కట్టబెట్టాలనే ప్రయత్నాలు తెరవెనుక తీవ్రంగా సాగుతున్నాయట. అందుకే దసరా, వచ్చినా సంక్రాంతి వచ్చినా ప్రజల కష్టాలు వారికి పట్టేలా లేవు. రూట్లు ప్రయివేటుకు అప్పగించి జేబులు నింపుకోవడంపైనే దృష్టి సారించారని ప్రజలు విమర్శిస్తున్నారు. చర్చల విఫలం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
రూ.2000 కోట్ల లక్ష్యం
రూట్ల వేలం ద్వారా ఏటా ఏపీకి రూ.2000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు భారీగా బస్సులు తిప్పే పనికూడా తగ్గడంతో కొత్తగా సిబ్బందిని తీసుకునే అవసరం కూడా ఉండదు. కొత్త బస్సులు కొనే పని ఉండదు. ఇవన్నీ అధ్యయనం చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ రూట్ల వేలం తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక ప్రయాణీకుల జేబుకు చిల్లుపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రధాన మార్గాల్లో ప్రగతి రథ చక్రాలు ఆగితే ప్రయివేటు ట్రావెల్స్ దోపిడీకి లైసెన్సు ఇచ్చినట్టే అవుతుంది. కేవలం ప్రయివేటు ట్రావెల్స్ పై ఆధారపడితే ప్రజలను దోచుకోవడంతో వారు చూపే శ్రద్ధ, ప్రయాణికుల క్షేమంపై ఉండదు. అందుకే అన్నీ మార్గాల్లో ప్రభుత్వం బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దసరాకు బస్సులు తిప్పడంలో ఏపీ విఫలం.. జనసేనాని
దసరా పండుగకు కూడా బస్సులు నడపడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రయాణికుల క్షేమాన్ని గాలికి వదిలేశారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడపాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.











